![YSRCP Leader Jogi Ramesh Critics Lokesh And Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/20/Jogi-Ramesh.jpg.webp?itok=vkyU4GEq)
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిందని గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శలు కురిపించారు. తుగ్లక్ పాలన అంటూ పిచ్చి కూతలు కూస్తున్న లోకేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ పాలనకు అసలైన నిదర్శనం చంద్రబాబు పాలనే అని చురకలంటిచారు. పాలనా పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మనసులు చూరగొన్నారని కొనియాడారు. ఐదేళ్ల తుగ్లక్ పాలన అనంతరం ఇప్పుడు రాజన్న పరిపాలన సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయ స్థాయిలో అవినీతి..
ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పిన బాబు అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని జోగిరమేష్ ఆరోపించారు. మొదట నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి తర్వాత అమరావతిని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. అనుయాయులు, పచ్చ పత్రికలతో విస్తృత ప్రచారం చేయించిన బాబు నూజివీడుల భూములు కొనేలా చేసి చాలామందిని మోసం చేశారని అన్నారు. ఇళ్లకు భూములు ఇవ్వని రైతుల ఇళ్లకు అధికారులు, మంత్రులను పంపి భయభ్రాంతులకు గురిచేశాడని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు రైతులకు ఏం లబ్ది చేకూర్చారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణమే భ్రాంతి అన్నట్టుగా మార్చి భ్రమరావతిగా చూపెట్టారని ఎద్దేవా చేశారు. విఠలాచార్య సినిమాల్లో సెట్టింగుల్లా.. బాహుబలి గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా ప్రచార ఆర్భాటాలే తప్ప ఐదేళ్ల పాలనలో కనీసం రాజధానికి సరైన రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని దుయ్యబట్టారు.
రుణం ఇస్తామని వాళ్లు చెప్పలేదు..
‘అమరావతి నిర్మాణ విషయంలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయని, సామాజిక న్యాయం జరగలేదని ప్రపంచబ్యాంకు జూన్ 12న ఓ లెటర్‌ను వారి వెబ్‌సైట్‌లో పెట్టింది. రాజధాని నిర్మాణం నుంచి తప్పుకుంటున్నామని జూలై 17 స్పష్టం చేసింది. అప్పటికీ మా ప్రభుత్వం వచ్చి 12 రోజులే అవుతోంది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంతటి దారుణం ఉంటుందా. మమ్మల్ని విమర్శించే ముందు లోకేష్ ఒకటి గుర్తుంచుకోవాలి. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని నడిబొడ్డున ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. మా పార్టీ కార్యాలయం కూడా రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు ఉందా. కనీసం పార్టీ కార్యాలయమైనా ఉందా. మీ దరిద్రంతోనే ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసింది’అని చురకలంటించారు.
Comments
Please login to add a commentAdd a comment