వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి(పాత చిత్రం)
అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో నకిలీ ఓట్ల చేర్పులపై ఫిర్యాదు చేయడానికే అమరావతి వచ్చానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గోపాల కృష్ణ ద్వివేదిని కలిసి నకిలీ ఓట్ల వ్యవహారాన్ని ఆయనకు వివరించారు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను 22 సార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మార్పులు, చేర్పులు కనిపించడం లేదని వ్యాక్యానించారు. ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) నిన్న తనపై ఫిర్యాదు చేశారని ప్రస్తావించారు.
టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలియకుండా ఒక్క పెన్షన్ కూడా రాదు.. అలాంటిది తాను ధర్మవరం నియోజకవర్గంలో 20 వేల ఓట్లు తీసేయించాను అని ప్రచారం చేస్తున్నారు..అందులో అసలు వాస్తవం ఉందా అని సూటిగా అడిగారు. పక్కా ఆధారాలతో చెబుతున్నా మా నియోజకవర్గంలో 6 వేల 73 నకిలీ ఓట్లను చేర్చారని ఆరోపించారు. ఈ ఓట్లు నకిలీవి కాదని నిరూపిస్తే తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని సవాల్ విసిరారు. టీడీపీ దొంగ ఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. ఒక్కసారైనా తప్పుల తడక లేకుండా ఓటరు లిస్టు ప్రచురితం చేయాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. ఎలక్షన్ కమిషనర్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment