
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పీఠాధిపతులంటే ఎందుకంత ద్వేషమో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రతిపక్షంపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ సీఎం అయినా తన విజయాలు, అభివృద్ధి చెప్పుకుని ఓట్లు అడుగుతారని, చంద్రబాబు మాత్రం ఏమీ చేయలేదు కాబట్టి తమపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి.. హిందూజా భూములకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నువ్వు చెప్పింది అబద్ధం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
ఈడీ, సీబీఐ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి.. 2017లో రాసిన లేఖ ఇప్పుడెలా బయటికి వచ్చింది.. మదుకాన్, రాయపాటి సాంబశివరావు నుంచి నీకు ముడుపులు ఎంత అందాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూజా భూములు అబద్ధం అయితే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా అని చంద్రబాబుకు మరోసారి సవాల్ విసిరారు. మనోజ్ కొఠారి ఒక చిన్న నగర స్థాయి నాయకుడని, అతనిపై కూడా స్టింగ్ ఆపరేషన్ చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై అధికారంలోకి రాగానే విచారణ చేస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment