విలేకరులతో మాట్లాడుతోన్న వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారధి
హైదరాబాద్: కాపీ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని, కాపీ కొట్టడంలో ఆయనను మించిన వారు లేరని వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరులతో మాట్లాడారు. రైతులను నాలుగేళ్లు పట్టించుకోలేదు.. ఎన్నికలకు ముందు పండుగ అంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. ఒక్క పంటకు కూడా టీడీపీ ప్రభుత్వం కనీస మద్ధతు ధర ఇవ్వలేదని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధిని ఖర్చు చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని తూర్పారబట్టారు. రైతులు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే వాళ్లను జైళ్లలో పెట్టించారని, టీడీపీ నాయకులు భయాన్ని సృష్టించి నానా యాగీ చేస్తున్నారని అన్నారు.
తిథిలీ తుపానుతో రూ.3600 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే చెప్పింది..కానీ వారిని ప్రభుత్వమే ఆదుకోలేదని గుర్తు చేశారు. ఒక పక్క పెథాయ్ తుపాను ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతుంటే.. రాజకీయాలు చేయడానికి పరాయి రాష్ట్రంలో చంద్రబాబు పర్యటించారని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని, నాలుగేళ్లు ఒక రంగు.. ఎన్నికల ఏడాది మరో రంగుతో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భయపడి ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. అప్పుడే ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు రద్దు చేసేవారని అన్నారు.
వ్యవసాయ రుణాలు అన్నీ రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీకి రూ.24 వేల కోట్లు ఇస్తామని చెప్పి... రూ.14 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.10
వేలు ఇస్తామని మరో నాటకానికి చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపెట్టారని, బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవకు నిధులే కేటాయించలేదని తెలిపారు. చంద్రబాబు, సీఎం కుర్చీ కోసమే మోసపూరిత హామీలు ఇస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రకటించిన 2 సంవత్సరాల తర్వాత పింఛన్ 2 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. బాబుకు దమ్ముంటే ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలకు ఎన్ని ఎకరాల భూమి సేకరించారో బయటపెట్టలన్నారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు తీసుకుని మళ్లీ పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 17న ఏలూరులో జరగబోయే బీసీ గర్జన గురించి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌తో చర్చించినట్లు తెలిపారు.
బీసీలకు నామినేటెడ్ పదవులు: జంగా
ఈ నెల 17న ఏలూరులో బీసీ గర్జన సభ జరగనుందని వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీ డిక్లరేషన్ విషయంలో బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్ తీసుకుంటారని తెలిపారు. ప్రతీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్‌పై వైఎస్ జగన్‌తో కూలంకశంగా చర్చించినట్లు తెలిపారు. నామినేటెడ్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేలా.. దానికి చట్టబద్ధత తీసుకుని వచ్చేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. బీసీలలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చర్చించామని, బీసీ గర్జన బీసీలకు దశ, దిశ నిర్ధేశంగా మారనుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment