
సాక్షి, విజయవాడ : చంద్రబాబు పేరు వింటే వెన్నుపోటు, అవినీతే గుర్తుకువస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓ రాజకీయ హంతుకుడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించిన వ్యక్తి.. ఇప్పుడు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ విగ్రహం పెట్టినట్లయితే పక్కనే ఆయన విగ్రహం కూడా పెట్టించుకోవాలని అప్పుడే వెన్నుపోటు రాజకీయాల గురించి ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ గుర్తువచ్చారు. ఆయన పేరు పెట్టిన ఒక్క పథకం అయినా సక్రమంగా అమలు జరుగుతుందా. అసలు ఎన్టీఆర్ పేరు ఇలా ఎందుకు నాశనం చేస్తున్నావు. ఇన్ని అబద్దాలు చెప్తున్న చంద్రబాబు పేరు గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలి అని ఓ లెటర్ రాయాలి అనుకుంటున్నా’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సుహాసిని ట్వీట్ చూసి కన్నీళ్లు వచ్చాయి...
‘చంద్రబాబుకి అధికారం, డబ్బు రెండూ ఉంటే చాలు. అప్పట్లో నన్ను బూచిగా చూపించి అందరిని వాడుకున్నారు. హరికృష్ణ చనిపోయే ముందు కూడా చాలా బాధపడ్డారు. లోకేష్‌కు అసలేం రాదు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయనకు దూరంగా ఉన్నారు. ఇంట్లో ఉన్న సుహాసినిని తీసుకొచ్చి ఎన్నికల బరిలో దింపారు. ఆమెను బలిపశువును చేశారు. సుహాసిని ట్వీట్ చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. నేను రాసిన ఎదురులేని మనిషి పుస్తకం ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు. ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని వాస్తవాలు అందులో రాశాను’ అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment