గుంటూరు: తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్‌కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. మంగళగిరి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అంటే తనకు చాలా అభిమానమని తెలిపారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలన్నారు. స్వయంగా పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే, మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దింపేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచమైన రాజకీయాలు చేశాడని ఆరోపించారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన, పోరాడుతున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబుకి, జగన్‌కు చాలా తేడాలున్నాయన్నారు. జగన్ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే.. చంద్రబాబు మాత్రం మామయ్యను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. జగన్‌పై అనేక కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడాడని, చివరికి జగన్‌పై హత్యాయత్నం కూడా చేయించిన నీచుడు చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు.
బాబుకి మతిమరుపు రోగం
చంద్రబాబు నాయుడికి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు. తన కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చు పెట్టి స్టాన్‌ఫోర్డ్ గ్యాడ్యుయేట్ యూనివర్సిటీ నుంచి దొంగ సర్టిఫికేట్ తెప్పించాడని ఆరోపించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్ అని, ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్‌ని నిలబెట్టాడని ఆరోపించారు. లోకేష్‌ని ఎక్కడ నిలబెట్టాలో అర్ధం కాక చివరికి సింహం లాంటి ఆర్కేకు ప్రత్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ఆర్కేకి సింహంలా పోరాడడమే వచ్చు కానీ గుంటనక్కల్లా రాజకీయం చేయడం తెలియదన్నారు.
మరో నంద్యాలలా చేయాలని చూస్తున్నారు
చంద్రబాబు నాయుడిలా నాలుగు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వైఎస్ జగన్‌కు తెలియదన్నారు. ప్రజల కోసం ఒంటరిగా పోరాడే వ్యక్తి జగన్ అని చెప్పారు. మంగళగిరి అన్ని నియోజకవర్గాల కంటే ప్రత్యేకమైనదన్నారు. మంగళగిరిలో ఆర్కే గెలిస్తే చరిత్ర సృష్టించినట్లేనని అభిప్రాయపడ్డారు. లోకేష్‌ని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని డబ్బును నీరులా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మరో నంద్యాల ఉప ఎన్నికలా చేయాలని చూస్తున్నారని అన్నారు. అడ్డగోలుగా కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని డబ్బును విపరీతంగా పంచుతున్నారని అన్నారు. మంగళగిరి ప్రజలు నీతి నిజాయతీ గల వ్యక్తులు అని, ఎవరికి ఓటువేయాలో వారికి తెలుసునన్నారు.
సింగపూర్ పారిపావాల్సిందే
ఆర్కే లాంటి వ్యక్తి అన్ని నియోజకవర్గాల్లో ఉంటే ప్రజల సమస్యలు తీరతాయని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని, అలాగే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే కాకుండా ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తండ్రీకొడుకులు(నారా చంద్రబాబు, నారా లోకేష్) ఇద్దరూ సింగపూర్ పారిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ఆర్కే గెలిస్తే మంగళగిరి ప్రజలు గెలిచినట్టేనని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment