కంకిపాడు పోలీసుల అత్యుత్సాహం | YSRCP leader Parthasarathi arrest in krishna district | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధి అరెస్ట్‌

Published Tue, Jan 9 2018 10:44 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

YSRCP leader Parthasarathi arrest in krishna district - Sakshi

సాక్షి, కంకిపాడు:  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి పార్థసారధిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయనను మంగళవారం పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తమని అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ సభలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అయితే సమస్యలను లేవనెత్తే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. నిలదీసిన విపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభ నడిపిస్తున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి ప్రతపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ ఎవరికి చేశారని, రుణాలు చెల్లించాలని బ్యాంక్‌ల నుంచి మహిళలకు నోటీసులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే అడ్డుకోవడం సరికాదంటూ...ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఆయన నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకున్నారు.

అలాగే వైఎస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు జన్మభూమికి వెళుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళుతున్న తమని భయపెట్టి నోరు మెదపకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కంకిపాడు పోలీసుల అత్యుత్సాహం
జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ నేత, మాజీమంత్రి పార్థసారధిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనతో పాటు ఇతర నేతలను పోలీసులు వాహనంలో...పలు పోలీస్‌ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారు. ముందుగా కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు అక్కడ నుంచి ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు వైపుకు తీసుకుని వెళ్లి మరలా ఉయ్యూరు వైపుకు తరలిస్తున్నారు. పోలీసుల వైఖరిపై వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement