
కంచె చేను మేసే విధంగా కోడెల వ్యవహారం ఉందని..
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో స్పీకర్ ఔన్నత్యాన్ని కోడెల శివప్రసాద్ రావు మంటగలిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. కంచె చేను మేసే విధంగా కోడెల వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల అసెంబ్లీ జరిపిన తీరు ఏపీ చరిత్రలోనే చీకటి అధ్యాయమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేసిన వ్యక్తి కోడెలని, ఎమ్మెల్యే రోజాను ఏకపక్షంగా సభ నుంచి ఏడాది సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో అన్నీ టీడీపీ కార్యక్రమాలుగా మారిపోయాయని, చంద్రబాబును ఎవరితో పోల్చినా వాళ్లను అవమానిచ్చినట్టేనన్నారు.
దేశ చరిత్రలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వారినే ప్రజలు ఓడించారని, సభలో న్యాయం జరగలేదనే వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. కోడెల రాజకీయంగా అత్యంత వివాదస్పదమైన వ్యక్తని, ఆయన అరచకాలను రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని తెలిపారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చిన అప్రజాస్వామిక వాది కోడెలని మండిపడ్డారు. కోడెల బెదిరింపులకు ఎవరు భయపడరని, అధికారం శాశ్వతం కాదని, కోడెల తెలుసుకోవాలని సూచించారు. తన అవినీతిని బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.