
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై టీడీపీ నాయకులు స్పందించిన తీరు బాధాకరమని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతినేతపై జరిగిన దాడిని ఖండించకపోగా కనీసం సానుభూతి కూడా తెలుపకుండా ముఖ్యమంత్రి, టీడీపీ మంత్రులు మానవ మృగాలుగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలను చంద్రబాబు రాజకీయ శిఖండులుగా మార్చుకున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు అమ్ముడు పోయి, పార్టీ మారిన ఫిరాయింపుదారులు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సానుభూతి కోసమే వైఎస్ జగన్ దాడి చేయించుకున్నారని మాట్లాడటం వారి దగా కోరు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. వైఎస్ జగన్ పేరు ఎత్తే అర్హత కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ప్రజల్లో వైఎస్ జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటననే పరాకాష్ట అన్నారు. సొంత మామను, పార్టీ నాయకులను అడ్డుతొలగించుకున్న చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుని దయ, ప్రజల దీవెనల వల్లే వైఎస్ జగన్‌కు ప్రాణాపాయం తప్పిందని రామయ్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment