
సాక్షి, కర్నూలు : సాధారణ మహిళగా ఉన్న బుట్టా రేణుకకు వైఎస్‌ఆర్ సీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే కనీస కృతజ్ఞత కూడా లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే నడుస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందినట్లు వెలువడ్డ వార్తలపై స్పందిస్తూ... గెలిచిన మూడో రోజే ఆమె భర్త పచ్చ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెంది ఉంటామో గుర్తించాలన్నారు. రహస్యంగా వెళ్లి సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతలకు కొదవ లేదు
ఫిరాయింపుదారులకు టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతోందో తెలుసుకోవాలని బుట్టా రేణుకకు బీవై రామయ్య సూచించారు. అక్కడ కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారికి మర్యాద ఇవ్వడంలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కర్నూలులోని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీలో ప్రజాదరణ కలిగిన నాయకులకు కొదవలేదన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.
మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి ఏమాత్రం జరగ లేదన్నారు. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.