
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో మాట్లాడుతూ...నాలుగున్నరేళ్లుగా హోదాపై చంద్రబాబు అనేకసార్లు మాట మార్చారని విమర్శించారు. ప్రస్తుతం ఓటమి భయంతోనే ఢిల్లీలో దొంగదీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల డబ్బును సిగ్గు లేకుండా పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేయడం ఆయనకే చెల్లిందని దుయ్యబట్టారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పోరాటాలతోనే ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందని పేర్కొన్నారు.
బాబుకు బీజేపీతో చీకటి ఒప్పందం
నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య విమర్శలు ఉంటున్నాయే గానీ విచారణ మాత్రం జరగడం లేదని సజ్జల అన్నారు. ప్రధాని మోదీ- చంద్రబాబు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. పోలవరం అంశం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి వెళ్లినా ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఇలా జరుగుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment