సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటవురట్ల సభలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పొత్తులపై సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్‌తో పొత్తు నిజం కాదా?
‘చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని తమ నాయకుడు అన్నది నిజం కాదా? చంద్రబాబు ఇతర పార్టీలతో పెళ్లిళ్ల సంగతి నిజం కాదా? విడాకులు తీసుకుంది నిజం కాదా? చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని బాబు అన్నట్లు పత్రికల్లో వచ్చింది. రాహుల్ గాంధీ మీటింగ్‌కు బ్రాహ్మణి వెళ్లింది నిజం కాదా? ఆమె ఎందుకు వెళ్లారు? కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారు. టీడీపీ- కాంగ్రెస్ కొత్త రూపంలో ప్రజల్లోకి రాబోతోంది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారు. గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారు. పార్టీకి, తనకు సిద్దాంతం అంటూ ఉండదు. గెలవడానికి ఏదైనా చేస్తారు. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలాంటి నాయకుడికి మద్దతిస్తున్న టీడీపీ నేతలు నైతిక విలువలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు కుట్ర, దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి.
వైఎస్సార్ సీపీ ఒంటరిగానే
2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటి చేస్తుంది. వైఎస్ జగన్ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టట్లేదు. వైఎస్ జగన్ నిఖార్సైన రాజకీయ నాయకుడు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తన పని పడతారని బాబుకు భయం పట్టుకుంది. వైఎస్ జగన్ సీఎం అవ్వగానే చంద్రబాబు దోపిడీని కక్కిస్తాం’ అంటూ సుధాకర్ బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment