సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వలనే ఉత్తరాంధ్రలో వలసలు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం విమర్శించారు. గురువారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారం, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, రాజన్న దొర, కంబాల జోగులు, పుష్ప శ్రీవాణి, కళావతి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవటానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే పేదలకు న్యాయం జరుగుతుందని నొక్కిఒక్కానించారు.
పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు : భూమన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే గెలవలేమని చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారులను తన స్వార్థం కోసం పావులుగా వాడుకుంటున్నారని తెలిపారు. అధికారులు చంద్రబాబు ఉచ్చులో పడొద్దని సూచించారు. ఎన్నికల అధికారులు దొంగ ఓట్లు అన్నింటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘చంద్రబాబు దళితులను అవమానించారు’
‘దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అంటూ మాట్లాడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళితులను అవమానించారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, పుష్పశ్రీ వాణి, కళావతి అన్నారు. వారు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో దళితులు, గిరిజనులు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో వారిపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దళితుల భూములను టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే దళితులకు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితుల, గిరిజనుల అభివృద్ధి జరిగిందన్నారు.
అందుకు వ్యతిరేకమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు : రాజన్నదొర
బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని చింతపల్లి సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లేటరైట్ పేరుతో మంత్రులు బాక్సైట్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2014కు ముందు విశాఖలో ఎలాంటి అనుమతులు లేవని, బాక్సైట్, లేటరైట్ తవ్వకాలకు నాటి ప్రభుత్వాలు అనుమతివ్వలేదని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, వారి కుమారులు ముఠాగా మారి తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. వీటిని గనుల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment