
సాక్షి, గుంటూరు: హోదా పేరుతో ప్రజల్ని వంచించిన చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు హోదా కోసం పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. వీఏఆర్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన ‘వంచనపై గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతోంది జగనేనని అన్నారు.
హోదా అంశంపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అందర్నీ మోసం చేశాడని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు హోదా కోసం ధర్మ పోరాటం అని కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తొక్కిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు దొంగ నాటకాలు ఇక సాగనీయమని హెచ్చరించారు. రాష్ట్రానికి హోదా రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment