సాక్షి, అమరావతి : ఏపీ పోలీసులపై చంద్రబాబు ప్రభుత్వానికే నమ్మకం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను చవటలుగా మార్చారని ఆరోపించారు. ఏ దర్యాప్తులోనైనా పోలీసులు పోలీసుల్లాగా వ్యవహరించారా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై చంద్రబాబుకు నమ్మకం లేదు కాబట్టే జెడ్‌ప్లస్ కేటగిరిలో ఆయన ఉన్నారని ఆరోపించారు. సిట్ నివేదిక అంటేనే నేరస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఆరు ఏడు సంఘటనలపై సిట్ దర్యాప్తు జరిపించారు వాటి నివేదికలు ఏమైనాయని ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణం సిట్ నివేదిక బయటకురాకుండానే గంటా శ్రీనివాస్ సీఎంకు ఎలా ధన్యవాదాలు చేబుతారని నిలదీశారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌లో సిట్ వేసి ఆధారాలు నీరుగార్చారని ఆరోపించారు.గోదావరి పుష్కరాల విషయంలో కూడా సిట్ దర్యాప్తులో ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కేసులో ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. సిట్ అంటేనే టీడీపీ నేతలకు ఇచ్చిన సీల్డ్ కవర్‌లా మారిందనన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కమిషన్‌లు, సిట్‌లపై నమ్మకం లేకుండా పోయిందని ఆరోపించారు. తుని ఘటన, సచివాలయంలో వాటర్ లీకేజీ, రాజధాని పంట పొలాలకు నిప్పు పెట్టిన ఘటనల విచారణ చూస్తే ఏపీ పోలీసులపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు స్వతంత్ర సంస్థచే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment