
గుంటూరు లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు
పట్నంబజారు (గుంటూరు)/విజయపురం(చిత్తూరు జిల్లా): టీడీపీ నేతలంతా దురహంకారంతో పేట్రేగిపోతున్నారని వారికి రాజ్యాంగమన్నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలన్నా గౌరవం లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం గుంటూరు లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేయటంతో పాటు, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేని వ్యాఖ్యలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..దళితులను కించపరుస్తున్న నాయకులపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న రోజుల్లో అధికార దురంహాకారానికి ఓటుతో బుధ్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నిరసనలో పార్టీ నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, బందా రవీంద్రనాథ్, బత్తుల దేవా, జగన్ కోటి, మేరిగ విజయలక్ష్మీ, అంబేద్కర్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, బోడపాటి కిషోర్, బాజీ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన అమృతలూరులో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో తెనాలి– చెరుకుపల్లి ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి చింతమనేని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
నగరంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు..
చింతమనేనిపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ కె. వెంకటరెడ్డికి ఫిర్యాదును అందజేశారు.
చంద్రబాబు అండతోనే చింతమనేని అరాచకాలు: ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
‘ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. అసెంబ్లీలో మహిళలపై కూడా దురుసుగా ప్రవర్తించారు’అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా అన్నారు. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పాలాభిషేకం చేశారు. రోజా మాట్లాడుతూ..గతంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేశారని గుర్తుచేశారు. అటవీ శాఖ అధికారులను కొట్టి, అంగన్‌వాడీ కార్యకర్తలను అసభ్యకరంగా మాట్లాడిన నాడే చింతమనేనిని చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందన్నారు. అలా చేసుంటే ఈ రోజు దళితులపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసేవారు కాదన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలను కేవలం ఓటర్లగానే చూస్తున్నానరే తప్ప మనుషులుగా చూడడం లేదని, వారి మనోభావాలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నాయకులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, చింతమనేనిని పార్టీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment