
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని, రాంగ్ మార్చ్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని, అందువల్ల పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలన్నారు.
రాజకీయాల్లోనూ పవన్‌ది నటనే :ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
పవన్ కల్యాణ్‌కు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ నటించడం అలవాటైపోయిందని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అందులో భాగంగానే విశాఖలో లాంగ్‌మార్చ్ పేరుతో చంద్రబాబు డైరెక్షన్‌లో నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆదివారం విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తూ.. మహిళా అధికారులపైన దాడులకు పాల్పడితే అప్పుడు పవన్ గాడిదలు కాశాడా? అని ప్రశ్నించారు.
టీడీపీ ఇసుక దోపిడీపై నోరు మెదపవేం పవన్: మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే విష్ణు ధ్వజం
ఎన్నికల ముందు తెరవెనక పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు ప్రత్యక్షంగానే కలసిపోయాయని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో టీడీపీ ఇసుక అక్రమ రవాణాపై పవన్ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదలను మంత్రి, ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 50 రోజులుగా కృష్ణా, గోదావరి, పెన్నా నదులకు వరద పోటెత్తిందని.. ఈ సమయంలో ఇసుకతీత ఎలా సాధ్యమో పవన్ చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment