అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ ధర్నా | YSRCP Leaders Conduct Dharna For Justice To Agrigold Victims | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 11:42 AM | Last Updated on Thu, Jan 3 2019 12:55 PM

YSRCP Leaders Conduct Dharna For Justice To Agrigold Victims - Sakshi

సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా, వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఈ ధర్నాలో అగ్రిగోల్డ్‌ బాధితులు పెద్దఎత్తున పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 19లక్షల 70వేల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు విలవిలలాడిపోతున్నా..సర్కార్‌లో కనీస చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు, అప్పులు, బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు సర్కార్ స్పందించపోవటం దారుణమన్నారు. మరణించిన అగ్రిగోల్డ్ బాధితులందరికీ వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో పాటు బాధితులు పెద్దఎత్తున పాల్గొని ధర్నాని విజయవంతం చేశారు.


విశాఖ : యలమంచిని నియోజకవర్గ కన్వీనర్‌ యూవీ రమణమూర్తి రాజు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గల అగ్రిగోల్డ్‌ బాధితులు ధర్నాకు దిగారు. బలిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దర్నాకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ధర్నాలో యూవీ రమణ మూర్తి రాజుతో పాటు సుకకుమార వర్మ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

కృష్ణా : అగ్రీగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ధర్నాకు బాధితులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మచిలీపట్నం నుండి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త  పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సులో అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడకు బయలుదేరారు. విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీమంత్రి కె.పార్థసారధి, ఎమ్మెల్యే రక్షణనిధి, నగర పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, అగ్రీగోల్డ్ బాధితుల బాసట కమిటీ నేతలు అడపా శేషు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు : ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్‌ ముందు వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధిత రాష్ట్ర కమిటి ధర్నాకు దిగింది. అగ్రిగోల్డ్‌ బాధితుల కమిటీ చైర్మన్‌ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్యర్యంలో జరుగుతున్న ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి భారీగా బాధితులు తరలివచ్చారు. 

అనంతపురం : కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్ బాసట కమిటీ ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ఆ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి రంగయ్య, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్ నారాయణ, తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి,  అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నేతలు కొర్రపాడుహుస్సేన్ పీరా, శంకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

కర్నూలు : అగ్రిగోల్డ్ భాదితులకు అండగా భారి ర్యాలి నిర్వహించారు .అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చెయ్యాలంటూ అగ్రిగోల్డ్‌ బాసట కమిటి కలెక్టరేట్ ముట్టడించింది.ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ   ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి ,కాటసాని రామిరెడ్డి ,కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య0, బాసట కమిటి సభ్యులు రుద్రగౌడ్ , కర్ర హర్షవర్దన్ రెడ్డి ,నంద్యాల నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కస్టమర్ల ఒత్తిడి తట్టుకోలేక విశాఖలో జిల్లాలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ మృతి
మునగపాక (యలమంచిలి) : అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ కరట్ల తాతరాజు (60) కస్టమర్ల ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన తాతరాజు 15 ఏళ్లపాటు అగ్రిగోల్డ్‌ సంస్థలో ఏజెంట్‌గా పనిచేశారు. తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ఇతర కస్టమర్లతో రూ.లక్షల్లో డిపాజిట్లు చేయించారు.

అగ్రిగోల్డ్‌ సంస్థ బోర్డు తిప్పేసిన నేపథ్యంలో నాలుగేళ్లుగా ఈ సంస్థ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లు తమ డిపాజిట్లు తిరిగి ఇప్పించాలంటూ తాతరాజుపై ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అపసార్మక స్థితికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించేలోగా రాత్రికి మృతి చెందారు. పెద్దదిక్కుగా ఉన్న తాతరాజు మృతితో కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement