మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా
కడప అగ్రికల్చర్: ‘రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో జపాన్ కంపెనీ మకీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం తీరు అధ్వానమని, చాలా ఇబ్బంది పెట్టారని ఆధారాలతో సహా దుమ్మెత్తిపోయలేదా? ఓటుకు నోటు కేసులో దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు రాష్ట్రప్రతిష్ట ఏమైందని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను, సీఎంను వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా ప్రశ్నించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తమకు అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా కావాలని నినదిస్తూ రోడ్ల మీదకు వస్తున్న తరుణంలో తమ పార్టీ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన టీడీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధంలేని విషయాన్ని అంటగట్టి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నామన్నారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి సీఎం వద్ద ఉండే భజనపరులైన మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా చిలువలు పలువలు చేసి మాట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైఎస్సార్ హయాంలో ఐఏఎస్‌లు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఏ తప్పు చేయలేదని కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని అడుగుతున్నామన్నారు.
ప్రజలారా...పోరాడండి, రోడ్లపైకి రండి రాష్ట్రం తరఫున నినదించండి మేం మాత్రం బయటకు రామనే ధోరణిలో సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్వయంగా సీఎం తిరుపతి సభలో ఈ దేశం అవినీతి మయమయ్యే వరకు నిద్రపోనన్నారు. మంత్రి లోకేష్ కూడా అవినీతి, కులపిచ్చి, మత పిచ్చి ఉన్నదంటే అది ఒక్క టీడీపీనే అన్న మాటలను టీడీపీ నేతలు మరచినట్లున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటికి నిన్న మంత్రి ఆదినారాయణరెడ్డి ఐఏఎస్‌ల సమక్షంలో సీఎం పంచాయితీ చేసి పనులు పంచుకోమన్నారని, అవినీతి వాటాలకు సీఎం పచ్చజెండా ఊపారని చెప్పిన విషయం వాస్తవం కాదా?అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నామన్నారు. వైఎస్ ప్రభుత్వ హాయంలో పరిశ్రమలు వస్తుంటే అడ్డుపుల్ల వేసింది మీరు కాదా? అని అన్నారు. నాడు బంగారు భూముల్లో పరిశ్రమలు ఎలా పెడతారని అడిగిన టీడీపీ నేతలు, నేడు పచ్చని పొలాల్లో రాజధాని కడుతుంటే నోరు మెదపరెందుకని ప్రశ్నించారు.
జిల్లాలో వైఎస్సార్ హయంలోనే రిమ్స్, మెడికల్ కశాశాల, ఫుడ్‌అండ్ సైన్సు కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలు, రింగ్‌రోడ్లు, గృహకల్ప కింద ఇళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు తెలుస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం 14 ఏళ్లుగా పరిపాలన చేసిందని, ఈ కాలంలో ఒక్క బలపం ఫ్యాక్టరీనైనా ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. నాలుగేళ్లుగా అభివృద్ధిని మరచి అక్రమాలకు పాల్పడుతూ, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంతో సంసారం బాగాలేదని చెప్పడం టీడీపీ నేతలకే చెల్లిందని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment