మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్రంలో గౌరు వెంకటరెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు
కర్నూలు, కోవెలకుంట్ల: తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న మోదీ, పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు, వారికి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ముగ్గురూ నటులేనని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక వీఆర్, ఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశానికి శిల్పాతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు నాలుగేళ్ల నుంచి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నా.. పవన్ ప్రశ్నించాల్సిందిపోయి వెనకేసుకురావడం తగదన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ నాయకుడు వైఎస్ జగన్ చిత్తశుద్ధిగా పోరాడుతున్నారన్నారు.
టీడీపీలో అలాంటిదేమీ లేదనడానికి గంటలోపే మంత్రి ఆదినారాయణరెడ్డి మాట మార్చడమే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, గాలేరునగరి, గోరుకల్లు, సిద్దాపురం, పులికనుమ, మల్యాల తదితర ప్రాజెక్టుల ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోనే ప్రాజెక్టుల పనులు 80శాతానికిపైగా పూర్తి కాగా మిగతా అరకొర పనులు చేసి ఆ ఘనత తమదేనని టీడీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు తరలిస్తుంటే ఇక్కడి టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే భవిష్యత్ అన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.
పథకాలకు చంద్రబాబు తూట్లు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, తదితర పథకాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. మళ్లీ వైఎస్సార్ పాలన రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో 14 సీట్లు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు నుంచి, కేంద్రం నుంచి తెచ్చిన వేల కోట్ల నిధులను అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పంచుకు తింటున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు శివరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గాండ్ల పుల్లయ్య, నాయకులు కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ పేరా శ్రీధర్‌రెడ్డి, సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, ఎల్వీ సుధాకర్‌రెడ్డి, భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment