సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా అందనివ్వకుండా పరిపాలనను స్తంభింపజేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ విధ్వంసం సృష్టించిందని వారు ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. బిల్లులు అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వారన్నారు. వీరు గురువారం మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వారేమన్నారంటే..
దుష్ట సంప్రదాయానికి టీడీపీ శ్రీకారం : బొత్స
► సభలో సంఖ్యాబలం ఉందని కీలకమైన బిల్లులను అడ్డుకోవడం ద్వారా టీడీపీ దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
► దీనిని అడ్డుకోవాల్సిన డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ అజెండాను అమలుచేయడం దారుణం.
► టీడీపీ సభ్యులను మా వాళ్లు అని ఆయన సంబోధించడం ద్వారా ఆ స్థానం విలువను దిగజార్చారు.
► ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఉద్యోగులకు టీడీపీ జీవితకాలం దూరమవుతుంది.
► చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌తో సభలో ఫొటోలు తీయిస్తూ రెచ్చగొట్టించారు.
► లోకేశ్‌కు న్యూసెన్స్ చేయడమే తెలుసు. ఇతనితోపాటు ఇతర సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం.
► సభలోని దృశ్యాలను ఇవ్వాల్సిందిగా చైర్మన్‌కు లేఖ రాశాం.
తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తా : అనిల్
► శాసన మండలిలో నేను జిప్ విప్పానంటూ లోకేశ్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, బాబు రాజేంద్రప్రసాద్ దుష్ప్రచారం చేస్తున్నారు.
► నేను తప్పు చేసినట్లు తేలితే రాజీనామా చేస్తా.. లేకపోతే మీరు రాజీనామాకు సిద్ధమా!?
► సభలో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన మంత్రి వెలంపల్లిపై లోకేశ్ దాడిచేశాడు.
► అర్ధరాత్రి వరకు సమావేశాలు జరిగిన సందర్భాలున్నాయి. అయినా మండలిని నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు.
► మండలిలో ఎక్కడ బూతులు మాట్లాడామో టీడీపీ నిరూపించాలి. సభలో వారే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
దాడిచేసిన వారిపై చర్యలు : గడికోట
► రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రతి బిల్లునూ టీడీపీ శాసన మండలిలో అడ్డుకుంటోంది.
► సభా సంప్రదాయాలను ఆ పార్టీ ఉల్లంఘిస్తోంది.
► మంత్రి వెలంపల్లి మీద దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటాం.
► శాసన మండలిలో లోకేశ్ ఫొటోలు తీయడం.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు, డిప్యూటీ చైర్మన్‌కు స్లిప్పులు పంపడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.
► డిప్యూటీ చైర్మన్‌ను యనమల సభలో నియంత్రించారు.
► మండలిలో టీడీపీ సభ్యులు అప్రజాస్వామికంగా వ్యవహరించి, చరిత్రహీనులుగా మిగిలిపోయారని.. లోకేశ్‌ను ప్రజలు క్షమించరని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.
సీబీఎన్ స్కూల్ ప్రిన్పిపాల్ యనమల: కన్నబాబు
► టీడీపీ వారికి నారా చంద్రబాబు నాయుడు (సీబీఎన్) అనే స్కూల్ ఉంది. ఆ స్కూల్కు ప్రిన్సిపాల్ యనమల.
► ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్రం కోసం కాకుండా కేవలం అమరావతి కోసం పని చేస్తోంది. వీరికి గవర్నర్ ప్రసంగం వినే ఓపిక కూడా లేదు. లోకేశ్ ఫోన్‌లో ఫోటోలు తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నిస్తే దాడి చేస్తారా?
► వెలంపల్లి పై దాడి చేసి... కనీసం విచారణ వ్యక్తం చేయడం లేదు. టీడీపీ వాళ్లు వీడియోలు అడుగుతున్నారు.. లోకేశ్ తీసిన వీడియోలున్నాయిగా. ముందు ఆ వీడియోలు బయట పెట్టాలని ప్రశ్నిస్తే పొంతన లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment