‘ఆయన సీఎం అయితేనే ఏపీకి మళ్లీ స్వాతంత్ర్యం’ | YSRCP Leaders Slams TDP Over Polavaram And Alliance With Congress | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 23 2018 11:54 AM | Last Updated on Fri, Nov 23 2018 12:07 PM

YSRCP Leaders Slams TDP Over Polavaram And Alliance With Congress - Sakshi

సాక్షి, జంగారెడ్డి గూడెం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే ఏపీకి మళ్లీ స్వాతంత్ర్యం వస్తుందని ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్‌ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్సీ అళ్ల నాని, చింతలపూడి కన్వీనర్‌ విఆర్‌ ఎలిజా, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి జంగారెడ్డి గూడెంలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో అయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏపీలో నారా రూపంలో ఉన్న రాక్షసుడిపై అందరం కలసికట్టుగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అరాచకపాలనకి ముగింపు జంగారెడ్డి గూడెం నుంచే ప్రారంభం కావాలన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 

అనుభవజ్ఞుడని చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం పేరిట కోట్ల రూపాయలను దిగమింగేశారని ఆరోపించారు. పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొట్టి కోట్లు తినేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో రైతులు నష్టపోతున్నా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పేకాటలలో మునిగిపోయారని శ్రీధర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీని తరిమికొట్టాలి: ఆళ్ల నాని
నిర్వాసితులకు న్యాయం చేయకుండా.. పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ప్రశ్నించారు.  వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్‌  జగన్‌ పూర్తి చేస్తారనే భరోసా ప్రజల్లో కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను ఇంటింటికి చెప్పాలన్నారు. పోలవరం అక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ సహా అధికార పార్టీకి చెందిన వారందరి పాత్ర ఉందని విమర్శించారు. పోలవరం అక్రమాలపై కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులందరికి ఫిర్యాదు చేసినప్పట్టికి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఏపీలో టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

హోదా జగన్‌తోనే సాధ్యం: విఆర్‌ ఎలీజా
రాష్ట్రాన్నిఅన్యాయంగా విడగొట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం ఏపీని మరోసారి మోసం చేయడమేనని చింతలపూడి కన్వీనర్‌ విఆర్‌ ఎలీజా అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్సించని కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌ తీసుకరావడం ఖాయమని  స్పష్టంచేశారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌ వల్లనే సాధ్యమవుతుందన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement