సాక్షి, వైఎస్సార్/నెల్లూరు/చిత్తూరు: నూతన సంవత్సరం సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పెద్ద మనసును చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు అండగా నిలబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సేవా కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు వద్ద రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రెండు రూపాయలకే భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంతో ఎంతో మంది పేద ప్రజల ఆకలి బాధలు తీరతాయని కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ సీసీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాల్లో ఒకటైన రాజన్న క్యాంటీన్‌ను రైల్వేకోడూరులో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. పల్లపు సుధాకర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీధర్‌రెడ్డి పిలుపునివ్వగా.. 4 లక్షల 70 వేల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఈ డబ్బును శ్రీధర్‌రెడ్డి ఆపరేషన్ నిమిత్తం బాధితుడికి అందజేశారు.
చిత్తూరు జిల్లా నగిరిలో ఎమ్మెల్యే రోజా నూతన సంవత్సరం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అప్పలాయ గుంటలో ఆమె వైఎస్సార్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ప్రతి మంగళవారం నాలుగు రూపాయలకే భోజనం అందించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగిరిలో కేక్ కట్ చేసిన రోజా కొత్త పేటలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు రెండు రూపాయలకే 20 లీటర్ల మంచి నీరు అందించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment