
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలపై కపట ప్రేమ మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో బీసీలకు అత్యున్నత పదవులు రాకుండా అడ్డుకున్న తీరు దారుణమని తెలిపారు. మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలపై ప్రేమ అంటూనే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపడంలో అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చెప్పేదొకటి, తర్వాత చేస్తోంది మరొకటన్నారు. బీసీ న్యాయమార్తుల విషయంలో చంద్రబాబు పంపిన నివేదికలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.