సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలైందని గుర్తు చేశారు. చంద్రబాబు తనయుడే ఘోరంగా పరాజయం పాలయ్యారని, కేవలం 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే టీడీపీ గెల్చుకుందని తెలిపారు. ఓటమిపై మహానాడులో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని అంబటి సూచించారు. చంద్రబాబుకు అధికార కాంక్ష తప్ప రాష్ట్రంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రతిపక్ష హోదాను కూడా చంద్రబాబు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించి లబ్ధిపొందాలన్నదే చంద్రబాబు తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి బుధవారం మాట్లాడారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ప్రభుత్వ సహాయక చర్యలపై.. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని అంబటి గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో టీడీపీ శ్రేణులకే సంక్షేమ పథకాలు అందాయని, ఆయన ధోరణి నచ్చకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా.. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంబటి వెల్లడించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. మే 30న రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పారు. వలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని అంబటి పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ నిత్యం సమీక్షలు చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment