సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా, నీతివంతంగా, నిజాయితీగా పరిపాలన అందించేందుకు వీలుగా తీసుకువస్తున్న చరిత్రాత్మక చట్టం జ్యుడీషియల్ కమిషన్ బిల్లు అని వైఎస్సార్‌సీపీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, పనులు అవినీతిపరులకు పాడి ఆవులుగా మారాయని, ఈ పరిస్థితిని మార్చేందుకే ఈ బిల్లును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. జ్యుడీషిల్ కమిషన్ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజలు కడుతున్న పన్నులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని, రాష్ట్రంలో నిజాయితీగా, స్వచ్ఛంగా పాలన జరగాలనే ముందుచూపుతో వైఎస్ జగన్ ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు.
రూ. వందకోట్లు అంతకుమించిన ఉన్న ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు ఇకపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో అందించబడతాయని, దీనిద్వారా ఎలాంటి తప్పునకు అవకాశమే ఉండదని తెలిపారు. గత ప్రభుత్వం నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చుకొని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిందని, దోపీడి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని వారు లూటీ చేశారని అన్నారు. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాన్ని చూడలేక సిగ్గుతోనే చంద్రబాబు ఈ సభలో లేకుండా పోయారని అన్నారు. ఈ బిల్లును చూసి చంద్రబాబు తట్టుకోవడం లేదన్నారు. 2014లో రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి రూ. 17,500 కోట్లు సరిపోతాయని చెప్పిన చంద్రబాబు.. తన ఐదేళ్ల హయాంలో రూ. 63వేల కోట్లు ప్రాజెక్టులపై వెచ్చించామని ఎన్నికల ప్రచారం స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు తాను ఎంపిక చేసుకున్న వ్యక్తుల ద్వారా రాష్ట్రంలోని ప్రజాధనాన్ని జలగల్లా లూటీ చేశారని, వేలకోట్ల రూపాయల ధనాన్ని దారిదోపిడీగాళ్ల కంటే, చంబల్ లోయగాళ్ల కంటే భయకరంగా ఆంధ్రరాష్ట్రాన్ని అత్యాచారం చేసినంత దారుణంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.
ఈ చర్చలో పాల్గొంటే తన అవినీతి నగ్నస్వరూపం బట్టబయలు అవుతుందనే భయంతోనే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభలో లేరని విరుచుకుపడ్డారు. ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి తావులేకుండా వైఎస్ జగన్ చేస్తారనే భయంతోనే చంద్రబాబు పారిపోయాడని ఎద్దేవా చేశారు. పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దోచుకున్న టీడీపీ నేతలు తమింకా పరిపాలనకు అర్హులని అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అనేక భావజాలు, తాత్వికతలతో వచ్చిన ప్రభుత్వాలు చేయడానికి సాహసించని మహాత్తరమైన చర్య ఈ బిల్లు అని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ పారదర్శకతను తీసుకొచ్చే ఈ బిల్లును ఏ ఒక్కరూ వ్యతిరేకించే అవకాశమే లేదన్నారు. వైఎస్సార్ అపర భగీరథుడిలా సంకల్పించి.. ప్రాజెక్టులను అతి తక్కువ ధరలో డిజైన్ చేయగా.. చంద్రబాబు ఆ ప్రాజెక్టుల వ్యయాన్ని కొన్ని పదులరెట్లు పెంచి.. దోపిడీకి దారులు తెరిచారని మండిపడ్డారు.
రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా గత చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీని, అవినీతిని కూడా వెలికితీయబోతున్నారని వివరించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకాలను మినహాయిస్తే.. చంద్రబాబు ప్రాజెక్టుల మీద ఖర్చు చేసిన మొత్తమంతా ఆయన బినామీలకు చేరిందన్నారు. గుడిని గుడిలోని లింగాన్ని కూడా మింగిన చరిత్ర చంద్రబాబు పాలనది అని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని కైంకర్యం చేయడాన్ని జ్యుడిషియల్ కమిషన్ బిల్లు చరమగీతం పాడతుందన్నారు. ఈ చట్టంతో అవినీతి, దందాగిరి చేసే అవకాశం ఇకపై ఉండబోదన్నారు. సీఎం వైఎస్ జగన్ ఒక సచ్ఛీలుడని, రాష్ట్రంలో నీతివంతమైనపాలన అందించాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులకు తాను బాధ్యతాయుతమైన కాపలాదారునని ఆయన నమ్ముతున్నారని, ఆయన తీసుకువస్తున్న చట్టాలతో రాష్ట్రంలో ఉన్నతమైన పాలన కొనసాగుతోందన్న విశ్వాసం, మనోధైర్యం రాష్ట్ర ప్రజల్లో కలుగుతోందని పేర్కొన్నారు.
వందకోట్లకు మించి ఉన్న ఏ ప్రాజెక్టు అయినా, పని అయినా న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్ల పరిశీలన జరుగుతుందని, అంతేకాకుండా వారం రోజులపాట టెండర్ల అంశం ప్రజల మధ్య ఉంటుందని, టెండర్లకు సంబంధించిన ప్రతి అంశం ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు. దీంతో ఏమాత్రం తప్పులకు అవకాశం ఉండదని, ఒక సంక్షేమ, అభ్యుదయ, అభివృద్ధికర ప్రభుత్వం అంటే ఇదీ అనే రీతిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సాహసోసేపతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ చట్టం అవినీతిపరుల గుండెల్లో శరాఘాతమని, ఇక తప్పు చేయడానికి వీలులేకుండా ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment