
సాక్షి, మచిలీపట్నం: బందరు సెంటిమెంట్ మరోసారి రుజువు కాబోతుందని మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేర్ని నాని అన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో రెండు పంటలకు సాగునీరు రావాలన్న, నిరుద్యోగులందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం రోజున వైఎస్సార్ సీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బాలశౌరి, నాని సుల్తాన్‌నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో బందర్ రోడ్లన్ని జనసంద్రంగా మారాయి. బందరులో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇక్కడ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని నాని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జనమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జోగి రమేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, నరేంద్ర మోదీతో జతకట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment