సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగిన ఆరోగ్యశ్రీని ఎందుకు ఆపేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల దగ్గర రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేయించుకోవచ్చనే ధీమా ఉండేదని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పోరేట్ వైద్యాన్ని పేదల చెంతకు చేర్చిన ఘనత ఆ మహానేతదే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పొగిడిన ఆరోగ్యశ్రీని ఏ కారణాల వల్ల ఆపేశారంటూ ప్రశ్నించారు. తమకు చెల్లించాల్సిన రూ. 500 కోట్ల బకాయిలను చెల్లించకపోతే.. నేటి నుంచి ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ప్రైవేట్ ఆస్పత్రులు తేల్చి చెప్తున్నాయన్నారు.
ఆయన కొనసాగిస్తూ.. రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షన్‌దారులు.. వారి కుటుంబసభ్యులు అందరిని కలుపుకుని మొత్తం 35 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని ఆరోపించారు. వాస్తవానికి ఉద్యోగులు, పెన్షన్‌దారుల ఆరోగ్యశ్రీ కోసం రూ. 200 కోట్లు ఎలాను చెల్లిస్తున్నారు.. ఇక మిగిలిన రూ. 300 కోట్లు చెల్లించలేరా అంటూ ప్రశ్నించారు. చార్టెడ్ ఫ్లైట్‌లకు, విదేశీ పర్యటనలకు, దొంగ ధర్మపోరాట దీక్షలకు వందల కోట్లు ఖర్చుపెడుతూ.. పేద వారి వైద్యానికి మాత్రం రూ. 500 కోట్లు ఇవ్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నబాబుకు కమీషన్లు అందకపోవడం వల్లనే ఆరోగ్యశ్రీని ఇలా నిర్వీర్యం చేస్నున్నారంటూ ఆరోపించారు. 1995 - 2004 వరకూ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. దోమలపై దండయాత్ర.. ప్రభుత్వ ఆస్పత్రులలో ఎలుకలు పట్టివేత అంటూ ఇలా ప్రతి చోటా కమీషన్లు మెక్కుతున్నారంటూ శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.
గతంలో రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. నేడు నారా చక్రవర్తి కూడా రాష్ట్రంలో తుపాన్ వస్తే తూతూమంత్రంగా సమీక్షలు చేసి చెన్నై వెళ్లి రాజకీయాలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే ఆరోగ్యశ్రీ వర్తించదనడం దారుణమాన్నారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసి.. సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ మీ వర్గం ప్రజలకు మేలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అందువల్ల నేడు పేదలు జబ్బు చేస్తే ఆస్పత్రికి కాకుండా టీడీపీ ఎమ్మెల్యే, నాయకుల ఇళ్లమందు పడిగాపులు గాస్తున్నారంటూ విమర్శించారు. ధనికలుతో పాటు పేదలు కూడా కార్పోరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలు పొందేలా వైఎస్ ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దితే.. నేడు చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదవాడి జేబులో రూ. 1000 ఉంటే చాలు.. దేశంలో ఏ పట్నంలో అయినా చికిత్స చేయించుకునేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. ప్రైవేల్ ఆస్పత్రులు చాలా రోజుల నుంచి తమకు బకాయిలు చెల్లించలేదని హెచ్చరిస్తూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment