
సాక్షి, గుంటూరు : పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లిస్తే తామంతా రాజీనామ చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజీనామానే కాదని, రాజకీయాల నుంచే తప్పుకుంటామన్నారు. తమ సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తెచ్చింది.. కాలువలు తవ్వించింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డే అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ హయంలో కాలువలు తవ్వించారు కాబట్టే ఈ రోజు పట్టిసీమ నుంచి నీళ్లొస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మూడేళ్లలో పోలవరంపై టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాల్సి ఉంటే అందులో పదోవంతు పనులు మాత్రమే జరిగాయి.