సాక్షి, అమరావతి: పారదర్శకత లోపించినప్పుడు అపనమ్మకం, అభద్రతాభావం కలుగుతాయని బౌద్ధ గురువు దలైలామా అన్నారని, ప్రతి విషయంలో పారదర్శకత అత్యవసరమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. జ్యుడీషియల్ కమిషన్ బిల్లుపై జరిగిన అసెంబ్లీలో చర్చలో ఆయన మాట్లాడారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకముంచి ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 86శాతం సీట్లు కట్టబెట్టారని, ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేరీతిలో ప్రజాసంక్షేమ, పారదర్శక పాలన కోసం సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతిలో మొదటిస్థానంలో ఉందని, ఇక, చంద్రబాబు తీసుకొచ్చిన ఓ జపాన్ సంస్థ సీఈవో ఆంధ్ర కంటే బిహార్ బెటర్ అని పేర్కొన్నారని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి ప్రపంచ దేశాల్లో మన రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు.
చంద్రబాబు తన హయాంలో రూ. 65వేల కోట్లు రూపాయలు ప్రాజెక్టుల మీద వెచ్చించినట్టు చెప్పారని, కానీ, ఆ ప్రాజెక్టుల వద్దకు వెళితే.. నిర్మాణాలు కానీ, డ్యాములు కానీ లేవని, అక్కడ కనీసం సాగుచేసుకునే ఆయకట్టు కూడా పెరగలేదని అన్నారు. ప్రాజెక్టులేవీ కట్టకపోయినా రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లకుపైగా చంద్రబాబు అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తమ టీడీపీ నేతలు ఏం చేసినా అధికారులు చూసీచూడనట్టు ఉండాలని గతంలో చంద్రబాబు అంటే.. మొన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తప్పు చేసింది మా పార్టీ శాసనసభ్యుడైనా వదిలిపెట్టొద్దని చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. నీతులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని, ఈ విషయంలో వైఎస్ జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి సంక్షోభాన్ని అవకాశాన్ని మలుచుకుంటామని గత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంటే ఏదొ అనుకున్నానని, కానీ ప్రజలకు వచ్చిన ప్రతి కష్టాన్ని తమకు అవకాశంగా మార్చుకొని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జీవీఎంసీలో దోమలు ఆడవా-మగవా తెలుసుకోవడానికి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రస్తావించి..నవ్వులు పూయించారు. చంద్రబాబు వద్ద పనిచేసిన ఇద్దరు చీఫ్ సెక్రటరీలు.. ఆయన పాలనలోని అవినీతిని బయటపెట్టారని, ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. అవినీతిని నివారించడానికి ముందుచూపుతో.. రాష్ట్ర సంపదని కాపాడటానికి తీసుకువస్తున్న జ్యుడీషియల్ కమిషన్ బిల్లు అందరికీ ఆదర్శం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment