సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదన్న ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారాయన. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. ఈ మేరకు ప్రకటన చేస్తూ.. అందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు మంత్రి అమర్నాథ్.
గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం లూటీ చేశారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకుతిన్నారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. ఆ అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల నుంచి టీడీపీ పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన దొపిడీ ప్రజలకు తెలియాలి. బోగస్ ఇన్‌వాయిస్‌లతో నిధులు మళ్లించారు. ఆర్‌వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరగా ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి. చంద్రబాబు, టీడీపీకి రూ.143 కోట్లు అందాయని తెలిపారు మంత్రి అమర్నాథ్.
సచివాలయం, కోర్టు నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలను షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది. మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి. మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు. తన పీఏ ఇచ్చే ఆదేశాలను ఫాలో కావాలని ఆయనకు బాబు చెప్పారు.
చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది. అంతేకాదు.. కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది. దాదాపు రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న అమర్నాథ్.. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సభలో ప్రదర్శించారు. షాపూర్ జీ పల్లోంజి సంస్థకు రూ.8వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోచుకోవడానికి చంద్రబాబు అలవాటు పడ్డారని విమర్శించారు మంత్రి అమర్నాథ్.
Comments
Please login to add a commentAdd a comment