సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఐదు కోట్ల మంది వికేంద్రీకరణను కోరుకుంటుంటే చంద్రబాబు ఒక్కరే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గురువారం అసెంబ్లీలో వికేంద్రీకరణ–పరిపాలనా సంస్కరణలపై జరిగిన చర్చలో భూమనతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి: భూమన
సీఎం జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా తెచ్చారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను గడప వద్దకే చేరవేస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు పాలనను చేరువ చేశారు. జిల్లాలను పునర్వ్యవస్థీకరించి రెవెన్యూ డివిజన్లు పెంచారు. అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ పేరుతో జిల్లాలను ఏర్పాటు చేసి తెలుగు వారి గొప్ప తనాన్ని ఇతర ప్రాంతాలకు తెలిసేలా చేశారు.
ఇప్పటికే 98 శాతానికిపైగా హామీలను నెరవేర్చారు. రాయలసీమను గతంలో అవమానకరంగా దత్త మండలాలుగా పిలిచేవారు. 1928లో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమగా నామకరణం చేశారు. కొప్పూరు రామాచార్యులు ప్రతిపాదించిన మద్రాస్, నెల్లూరు, రాయలసీమతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఉంటే సీమ దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రంగా ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మొదటిసారిగా రాయలసీమ వాసుల కడగండ్లు, కన్నీరు తుడిచారు.
వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను చేపడితే చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ప్రకాశం బ్యారేజీపై ఆందోళన చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలని ప్రయత్నించారు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ శాసన సభలో తీర్మానం చేశారు. దీని వెనుక సామాజిక ప్రయోజనాలు దాగున్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో విభిన్న ఆలోచనలు, అభివృద్ధిలో తేడాలున్నాయి. తెలుగువారిగా అందరం కలిసి ఉండాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష.
కేంద్రాన్ని కాదని నారాయణ కమిటీ: కన్నబాబు
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటుపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే చంద్రబాబు స్వప్రయోజనాలకోసం నారాయణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసి రామోజీరావు సూచనల మేరకు అమరావతి పేరు పెట్టారని ఈనాడులో వార్త రాశారు. రాజధాని ఎక్కడ ఉండాలో బాబు తనవర్గం వారితో చర్చించి ముందుగానే భూములు కొనుగోలు చేయించారు.
హైదరాబాద్ తరహా ప్లాన్‌నే అమరావతిలోనూ అమలు చేశారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు, ఇతర పనులకు రూ.1.80 లక్షల కోట్లతో ప్రణాళిక ప్రకటించారు. రూ.14 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నప్పుడు ఒకే దగ్గర రూ.లక్షల కోట్లు ఎలా వెచ్చిస్తారు? రాజధాని విషయంలో జరిగిన ఈ లోపాలను సీఎం వైఎస్ జగన్ సరిదిద్దుతున్నారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాంధ్రకు బాబు వెన్నుపోటు.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్
ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు విశాఖకు ఏం చేశారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. హిందూస్థాన్ జింక్‌ను ప్రైవేటు పరం చేసిన ఘనత వారిది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధే విశాఖను గొప్ప నగరంగా నిలబెట్టింది. అచ్యుతాపురం సెజ్‌లో వేల మందికి ఉపాధి దొరుకుతుందంటే వైఎస్సార్ చలవే.
విశాఖ విశిష్టతను గుర్తించిన సీఎం జగన్ పరిపాలన రాజధానిగా నిర్ణయిస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఉత్తరాంధ్ర ఓట్లు వేయించుకుని మోసం చేసింది. వెన్నుపోటు పొడిచి ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రాగా మిగిల్చారు. రియల్ ఎస్టేట్, క్యాపిటలిస్టుల పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా అడ్డుకుంటారు.
సమైక్య ఉద్యమంపైనా ఇలా స్పందించలేదు..
అమరావతి పాదయాత్ర చంద్రబాబు డైరెక్షన్‌లో, ఆయన పెట్టుబడితో సాగుతోంది. రైతులు చేపట్టిన యాత్రపై ఏదో జరిగిపోతోందన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. సమైక్య రాష్ట్ర ఉద్యమంపై కూడా ఈనాడు ఇంతగా ప్రచారం చేయలేదు. నారా హమారా.. అమరావతి హమారా అనే నినాదాలే అసలు విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నేను కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిని విమర్శిస్తే టీడీపీకి చెందిన బుచ్చయ్య చౌదరికి కోపం వచ్చింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని కథనాలు రాస్తున్న ఈనాడు.. రాజధాని ఒకేదగ్గర కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల వారికి జరిగే నష్టం గురించి రాయడం లేదు.
అమరావతిని పార్టీలన్నీ అంగీకరించాయి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల
అన్ని పార్టీల ఆమోదంతోనే రాజధాని ఎంపిక జరిగింది. 175 నియోజకవర్గాలకు ఆదాయాన్ని సమకూర్చేలా అమరావతి నిర్మించాలని తలపెట్టాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పాలన చేస్తోందంటే టీడీపీ సర్కారు అమరావతిలో చేసిన అభివృద్ధి వల్లే. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి కానీ పాలనా వికేంద్రీకరణ కాదు. అమరావతి దేవతల రాజధాని. దాన్ని ఎందుకు మార్చాలని చూస్తున్నారు. ఇక్కడ కమ్మ, రెడ్డి కులస్తులు సమానంగా ఉన్నారు. 75 శాతం మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలున్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను కాదనడం సరికాదు. రాజధానిని మార్చడం కుదరదని పార్లమెంట్ సైతం చెప్పింది.
భ్రమరావతిగా మార్చింది బాబే: కొడాలి నాని
చంద్రబాబే అమరావతిని గ్రాఫిక్స్‌తో భ్రమరావతిగా మార్చారు. 29 గ్రామాలు కలిగిన ప్రాంతాన్ని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి మహానగరాలతో పాటు సింగపూర్, మలేషియాతో పోలుస్తూ రియల్ ఎస్టేట్ దందా చేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. విశాఖలో తక్కువ ఖర్చుతో వేగంగా రాజధాని అభివృద్ధి చెందుతుంది.
సీఎం జగన్ ఎన్నడూ కులాలు, మతాలను చూడలేదు. అలా చూసి ఉంటే రాయలసీమలోనే పరిపాలన రాజధాని పెట్టేవారు. అమరావతిలో కమ్మవారిని దెబ్బతీసేందుకు రాజధానిని తరలిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. పరిపాలన రాజధానిగా నిర్ణయించిన విశాఖలోనూ కమ్మవారి డామినేషనే ఉంది. అమరావతిలో అనేక కుంభకోణాలు, అవకతవకలు జరిగాయి.
సంపద మొత్తాన్ని ఇక్కడే వెచ్చిస్తే మిగిలిన ప్రాంతాలు ఎప్పటికి అభివృద్ధి చెందుతాయి? అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తామంటే రూ.లక్షల కోట్లతో నిర్మిస్తానని బాబు ప్రచారం చేశారు. ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను బినామీల పేర్లతో కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందారు.
గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి 800 ఎకరాలు భూసేకరణ చేస్తే 200 ఎకరాలు కలిగిన పేద రైతులకు కాలువకట్టలు, లోతట్టు ప్రాంతాల్లో భూములిచ్చి మిగిలిన 600 ఎకరాలకు సంబంధించి తన వర్గానికి చెందిన వారికి రాజధానిలో రూ.3,600 కోట్లు విలువైన భూమిని కట్టబెట్టి అమరావతిని కమ్మరావతిగా మార్చేశారు. ఇందులో సినీ ప్రముఖులు అశ్వినీదత్, రాఘవేంద్రరావు, కేవీ రావు, శ్రీధర్ లాంటి వారున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు.
భూములు కొన్న బుచ్చయ్య
అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికీ రాజధాని ప్రాంతంలో ఎకరం నుంచి ఐదెకరాల వరకు భూములున్నాయి. బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో స్థలాలను అమ్మేసి రూ.3 కోట్లతో అమరావతిలో మూడెకరాలు కొన్నారు. ఇప్పడు వాటికి ధర లేదు. ఆయన అమ్మేసిన భూముల ధర రూ.11 కోట్లకు చేరింది. తమ భూముల ధరలు పెరగాలంటే బాబును గద్దెనెక్కించాలని కుట్రలు చేస్తున్నారు.
చంద్రబాబును నమ్మి మోసపోయిన అమాయకులను రెచ్చగొట్టి పాదయాత్రలు చేయిస్తున్నారు. 500 కిలోమీటర్ల దూరాన్ని 50 రోజుల్లో పూర్తి చేస్తారు. నా నియోజకవర్గంలో మాత్రం 45 రోజుల పాటు యాత్ర చేస్తారట. పాదయాత్ర ప్రారంభించగానే రామోజీరావు మీడియాలో మహా ఉద్యమం కలరింగ్ ఇస్తున్నారు. రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరి సైతం డాంబికాలు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment