సాక్షి, విశాఖపట్నం: ఇసుక కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. శనివారం విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇసుక కొరత లేదని తాము ఎక్కడా చెప్పలేదని.. ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ప్రతిపక్షాలు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. వరదల సమయంలో ఇసుక తీయడం ఎంత కష్టమో ఐదు కోట్ల ప్రజలకు తెలుసునన్నారు. పవన్‌కల్యాణ్ ఎన్నో బ్యానర్లలో నటించారని.. రాజకీయాల్లో మాత్రం ఒక్క నారా వారి బ్యానర్‌లోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2016 జనవరి 26 న ప్రత్యేక హోదాపై కొవ్వొత్తుల ర్యాలీకి వస్తానన్న పవన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ది చెప్పిన మాటకు కట్టుబడే తత్వం కాదన్నారు. రేపు పవన్ చేయబోయే లాంగ్ మార్చ్ జనసేనకి లాస్ట్ మార్చ్ అన్నారు.
సినిమాలు ఎందుకు మానేశారో మొదట అర్థం కాలేదు..
‘మీరు పోటీ చేసిన గాజువాక ప్రజలకు ఎన్నికల తర్వాత ఎందుకు ముఖం చూపలేదు? మీకు ఓటేసిన 57 వేల మంది గాజువాక ఓటర్లకి ఎన్నికల తర్వాత కలిసి కృతజ్ఞతలు తెలిపారా? మీ సైన్యం జారిపోతున్నా మీరు ముందుకు వెళ్లడానికి చంద్రబాబు కారణం కాదా?’ అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. పవన్ సినిమాలు ఎందుకు మానేశారో మొదట అర్థం కాలేదని.. చంద్రబాబుకు ఇచ్చిన కాల్షీట్ల వలన వచ్చే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం వలనే సినిమాలు మానేశారని అర్థమైందన్నారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని, అవి పవన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఉద్ధానం అంటూ తిరిగి ఏం ఉద్ధరించారు..
ఉద్ధానం అంటూ తిరిగి బాధితులను ఏం ఉద్ధరించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఉద్ధానం బాధితులకు రూ.10వేల పింఛన్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారన్నారు. అయిదు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన సిఎం జగన్ పై ఓర్వలేనితనంతో విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌కి ఇసుక డాన్ అచ్చెన్నాయుడు టీడీపీ తరపున ముఖ్య అతిథిగా వస్తున్నారనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మీరు లాంగ్ మార్చ్ చేసినా, పాకినా ప్రజలు విశ్వసించరన్నారు. ‘మీది లాంగ్ మార్చ్ కాదని.. షార్ట్ మార్చేనని... మీకు లాంగ్ అనే పదం సూట్ కాదని’ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పవన్ ఎందుకు పడిపోయారో అర్థం కావటం లేదన్నారు. అక్రమ పోరాటాలను ప్రజలు విశ్వసించరన్నారు. ఏపీ ప్రజల మేలు కోసం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. భవన కార్మికులకి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఇసుక కొరత తాత్కాలికమేనని అమర్‌నాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment