
సాక్షి, తాడేపల్లి: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తన పదవిని కాపాడుకోవడానికే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేసే ముందు ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలనే కన్నా చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ ఎంత విచ్చలవిడిగా జరిగిందో కన్నాకు తెలియదా అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసి బీజేపీ నేతలు చేసిన విమర్శలు.. రోజూ చంద్రబాబు చేసే విమర్శలేనన్నారు. టీడీపీ విధానాలను బీజేపీ నేతలు అమలు చేస్తున్నారా.. అని నిప్పులు చెరిగారు.
బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్..
దళిత ఎమ్మెల్యేను టీడీపీ నేతలు దూషిస్తే నోరు ఎందుకు మెదపలేదో కన్నా సమాధానం చెప్పాలన్నారు. అచ్చెన్నాయుడు ఒక ఐపీఎస్ అధికారిపై నోరు పారేసుకొంటే ఎందుకు మాట్లాడలేదని.. దళిత ఎస్‌ఐపై టీడీపీ నేతలు కులం పేరుతో అవమానిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైస్సార్‌సీపీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అర్హత కన్నాకు లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ, రైతుల కోసం రైతు భరోసా వంటి పథకాలు తీసుకోస్తే కన్నా ఎందుకు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్ లా ఉన్నాయని విష్ణు ఎద్దేవా చేశారు.
టీడీపీ క్రిమినల్స్ పార్టీ...
టీడీపీ క్రిమినల్స్ పార్టీ అని.. సదావర్తి భూములను కాజేస్తే కన్నా ఏమి చేశారని ప్రశ్నించారు. టీడీపీని.. టీడీపీ నాయకులే భ్రష్టు పట్టించారన్నారు. దుర్గమ్మ సన్నిధిలో క్షుద్రపూజలు చేసింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. దేవాలయ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని కన్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. పేదల ఇళ్ల కోసం దేవాలయ భూములను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన కొంతమంది టీడీపీ నాయకులు బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యనించారు. బీజేపీ అధ్యక్షుడిగా కన్నా తొలగించాలని సుజనా, సీఎం రమేష్ వంటివారు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment