సాక్షి,విజయవాడ : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దేవాలయాల జోలికి వస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ మధురా నగర్‌లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలువ గట్టు వివి.నరసరాజు రోడ్డులో స్థానికులు చేపట్టిన దుర్గాదేవి ఆలయం నిర్మాణాలు తొలగించారు.తాజాగా,అదే ప్రాంతంలో శ్రీకృష్ణుడి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూల్చివేశారు. సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు.
గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.
‘గోశాలను కూల్చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం.సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.ఈ కూల్చివేతల బాధ్యత చంద్రబాబు,పవన్,దేవాదాయశాఖ మంత్రిదే,రాష్ట్రప్రభుత్వ శాఖలే దుర్మార్గంగా వ్యవహరించడం హిందూ ధర్మం,సనాతన ధర్మం పైన దాడిగానే పరిగణించాలి. గోవుల రక్షణ వైఎస్సార్సీపీ ధ్యేయం.
కెనాల్ బండ్ ప్రొటెక్ట్ చేయాలని మేం ఆనాడే నిధులిచ్చాం.ఫెన్సింగ్ పనులు ప్రారంభించాం. బుల్డోజర్లతో ఇలా కూల్చివేతలకు పాల్పడటం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే. మరోసారి గుడుల జోలికి వస్తే ఊరుకోం.పుష్కరాల సమయంలో అనేక దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారు. ఆంజనేయ విగ్రహం మున్సిపల్ ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడూ..ఈనాడూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment