రాష్ట్ర హక్కులనుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి
మైదుకూరు(చాపాడు): ఏపీ విభజన అనంతరం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇద్దరూ తోడుదొంగలేనని ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టపు హామీల అమలు, కడప ఉక్కుఫ్యాక్టరీ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘాల(జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జీపుజాతా గురువారం మైదుకూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాలేజీ, స్కూళ్ల విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు.
అనంతరం ఎన్నికల్లో నెగ్గేందుకు నానా అబద్దాలు అడి అధికారంలో వచ్చాక తెలుగు ప్రజలను అన్యాయం చేస్తున్నారన్నారు. పోరాటాలు చేసైనా మన హక్కులను సా«ధించుకుందామన్నారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రం కోసం సాధించింది ఏమీ లేదన్నారు. ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీ కావాలని సీఎం కోరారని తెలిపారు. ఇప్పుడేమో హోదా కావాలంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీతో పోరాటం అంటారు.. కేంద్రంలో బీజేపీతో రాజీ పడతారని చంద్రబాబును విమర్శించారు. రూ.1500 కోట్లతో పనులు ప్రారంభించిన కడప ఉక్కు ఫ్యాక్టరీని అప్పట్లో చంద్రబాబు ఆపించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఉక్కు దీక్ష అని మోసం చేస్తున్నాడన్నారు. వైఎస్ బతికి ఉన్నట్లయితే ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయి లక్షలాది మందికి ఉపాధి దొరికేదని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు మాత్రం ప్రతి దానిపై యూటర్న్ తీసుకుంటూ ఊసరవెల్లిని మింగి రంగులు మారుస్తున్నాడని ఆయన విమర్శించారు.
పోరాటాలతోనే మన హక్కులను సాధించుకుందామని.. విద్యార్థి యువజన సంఘాలు(జేఏసీ) ఈ నెల 25న చేపట్టనున్న కోటి మందితో మానవ హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరం రోడ్డెక్కుదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలతో పాటు చాపాడు జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, ఎంపీపీ భర్త లక్షుమయ్య, వైఎస్సార్‌సీపీ మైదుకూరు పట్టణ అధ్యక్షుడు లింగన్న, చిన్న, గోశెట్టి లక్షుమయ్య, బోకుల కొండారెడ్డి, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సొక్కం శివ, కుశెట్టి రాయుడు, మున్నా, షరీఫ్, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, చాపాడకు చెందిన మాజీ సింగిల్ విండో జయరామిరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎల్లారెడ్డి, మహేష్ యాదవ్, ఎస్సీ నాయకులు జయరాజు, దువ్వూరుకు చెందిన కానాల జయచంద్రారెడ్డి, శంకర్‌రెడ్డి, చింతకుంట వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment