సాక్షి, హైదరాబాద్ : పదేపదే ప్రజలను మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి పేరుతో మరో మోసపూరిత కార్యక్రమానికి తెరలేపారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. గతంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను చెత్తబుట్టల్లో పారేసి, ఇప్పుడు కొత్తగా సాధించేదేమిటని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా మారిందన్నారు. జన్మభూమి పేరుతో అధికారులు, స్కూల్ పిల్లలను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ రెండు ఊర్ల సంగతేంటి? : ‘‘ఎవరి గ్రామాన్ని వాళ్లే అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. అయ్యా.. మరి మీ నారావారిపల్లె సంగతేంటి? అక్కడి స్కూల్ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఇక మీ తనయుడు లోకేశ్ బాబు దత్తత తీసుకున్న నిమ్మకూరు(ఎన్టీఆర్ స్వగ్రామం)లో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. కనీసం సొంత ఊళ్లను కూడా పట్టించుకోని మీరు.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? మీ అబద్ధాలను ప్రజలు నమ్మాలా? ఇప్పటికైనా ఆ రెండు ఊళ్లకు న్యాయం చేయండి. ఆ తర్వాత మిగతా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడండి’’ అని ఆర్కే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment