
ప్రచార రిక్షాను నడుపుతున్న ఎమ్మెల్యే రోజా
సాక్షి, పుత్తూరు (చిత్తూరు జిల్లా): తండ్రి చంద్రబాబు గుడిని మింగితే కుమారుడు లోకేష్ గుడిని, గుడిలో లింగాన్ని మింగేరకమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఘాటు విమర్శలు చేశారు. చివరి నిమిషంలో చంద్రబాబు చెప్పే మాటలకు మరోసారి మోసపోవద్దని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. బుధవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులతో కలిసి ఆమె ప్రారంభించారు.
పుత్తూరులో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న భూమన, రోజా తదితరులు
రాష్ట్రంలో రాజధాని, ఇసుక, మద్యం, ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు లూఠీ చేశారన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిలో సొంతంగా ఇళ్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని, సీఎం చంద్రబాబుకు అమరావతిలో అడ్రస్ కూడా లేదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అడ్రస్‌ను గల్లంతు చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మించిన తనయుడుగా జగన్ సంక్షేమం, అభివృద్ధి అజెండాగా మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు చెప్పారు.
రిక్షా నడిపిన రోజా: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రిక్షాలను శనివారం ఎమ్మెల్యే రోజా పట్టణంలో ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రచార రిక్షాను నడిపి పార్టీ శ్రేణులు, పట్టణవాసులను ఉత్సాహపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment