సాక్షి, తిరుపతి : దళితుల గురించి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వారిని చంద్రబాబు గతంలో అవమానించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను అనుసరిస్తున్నారంటూ విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని అన్నారు. అలా వచ్చే ప్రతీ ఒక్కరు తమ పదవులకు రాజీనామా చేయడం వైఎస్ జగన్ నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం వైఎస్సార్ సీపీ నుంచి కొన్న వారి చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)
తనకు ఓ నీతి.. ఇంకొకరికి వేరే నీతి
పుల్వామా ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనను ఎందుకు సమర్థిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదుల చర్యకు ఇప్పుడు ప్రధాని మోదీని రాజీనామా చేయమంటున్న బాబు... ఆనాడు 30 మంది ప్రాణాలు బలిగొని తానెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును దారుణంగా కొట్టి చంపారని..(కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?) కనీసం ఇప్పుడైనా ఎందుకు రాజీనామా చేయడం లేదని ధ్వజమెత్తారు. ద్వంద్వ విధానాలు ఉన్న చంద్రబాబుకు తనకో నీతి.. మరొకరికి వేరే నీతి అన్నట్టుగా వ్యవహరించడం అలవాటేనని ఎద్దేవా చేశారు.(మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?)
Comments
Please login to add a commentAdd a comment