మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యేలు రాజా, గ్రంథి శ్రీనివాస్
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఓ రాజకీయ ఉగ్రవాదిగా తయారయ్యారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దిగజారి విమర్శలు చేస్తే సహించేదిలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, గ్రంథి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడేటపుడు చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. తొలుత దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు జిత్తులమారి నక్క అయితే యనమల రామకృష్ణుడు ఓ గుంటనక్కలా ఉన్నారన్నారు.
తాము అసెంబ్లీలో శాసనమండలి తీర్మానం రద్దుకు మద్దతుగా మాట్లాడామని, అనారోగ్యకారణాల వల్ల సభ నుంచి బయటకు వెళితే ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎంత బతిమాలినా సజావుగా అసెంబ్లీకి హాజరుకావడంలేదని, మరి ఆయనకు తన ఎమ్మెల్యేలపై నమ్మకం ఉందా? అని రాజా ప్రశ్నించారు. యనమల శాసనమండలి గురించి నీతులు చెబుతున్నారని, అయితే వైఎస్ మండలిలోకి మేధావులను తెస్తే చంద్రబాబు మాత్రం కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధమున్న బుద్ధా వెంకన్న, పప్పుగా పిలిచే లోకేష్, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన యనమల లాంటి వారికి స్థానం కల్పించారని విమర్శించారు. గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నిబద్ధత, నీతి, లేకుండా మాట్లాడుతున్నారని, నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం ఆయన నైజమన్నారు.
అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు
చంద్రబాబు అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, మండలి విషయంలో గతంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని గడికోట విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీలను వైఎస్సార్‌సీపీ వాళ్లు ప్రలోభ పెడుతున్నారనడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రలోభాల పర్వానికి యావత్ దేశంలోనే చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. వైఎస్ జగన్ గురించి అవాకులు చవాకులు పేలితే సహించబోమన్నారు. కొన్ని పత్రికల్లో ఎమ్మెల్యేలను అవమానించే విధంగా వార్తలు రాస్తున్నారని, ఆ ఎమ్మెల్యేలపై ఉన్న కేసులన్నీ టీడీపీ వారు పెట్టిన దొంగ కేసులేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment