సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. ఆదివారం మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ నగర పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబూరావుతో పాటు మంత్రులు మోపిదేవి వెంకట రమణ, అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, అదీప్ రాజ్, కన్నబాబు రాజు, కన్వీనర్ లు ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, అక్కరమాని విజయ నిర్మల, మళ్ళ విజయ్ ప్రసాద్, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరీ, జిల్లా పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పీలా వెంకట లక్ష్మీ తో పాటు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సువర్ణ పాలన మొదలైందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యకర్తలు అభద్రతాభావానికి గురికావొద్దు
నియోజకవర్గాలలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని పర్యాటక, యుయజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే రధసారుధులని, కార్యకర్తలు లేనిదే పార్టీ మనుగడ లేదన్నారు. కార్యకర్తలు అభద్రతాభావానికి గురికావొద్దని, వారికి అన్నివిధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రాజీనామా చేశాకనే వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానం ఉంటుందన్నారు.
అవినీతి రహితంగా పనిచేయాలి
జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులు సూచించారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. అవినీతి రహితంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కార్యకర్తలకు సూచించారు.
జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి
గత ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ జీవీఎంసీ ఎన్నికల గెలుపై లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అవినీతి రహితంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గత ప్రభుత్వం హయంలో ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారని, వారి సమస్యలు తెలుకొని పరిష్కరించే దిశగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment