
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : ఎన్నికల నేపథ్యంలో పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తినైనా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. పలాస సభలో దువ్వాడ మాట్లాడుతూ.. ‘18 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మంత్రి అచ్చెన్నాయుడు నా వ్యాపారాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఆర్థికంగా బాగా చితికి పోయా. అయినప్పటికీ నాపై నమ్మకం ఉంచి వైఎస్ జగన్ నాకు తోడుగా నిలబడ్డారు. నాలాంటి సామాన్యుడికి అవకాశం ఇచ్చిన ఆయనకు జన్మజన్మలకు ఆయనకు రుణపడి ఉంటా’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు.(2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్ జగన్)
కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తాం, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పలాస నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి.. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment