సాక్షి, విజయవాడ: ఏపీలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఎండీ కరీమున్నీసా తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు సీఎం జగన్ రాష్ట్రంలో అండగా ఉన్నారని చెప్పేందుకు నిదర్శనం తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమేనని అన్నారు. పార్టీతో నడిచినవారికి తగిన గుర్తింపు వైఎస్సార్‌సీపీలో ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
శ్రీకాకుళం : ఎమ్మెల్సీగా తనకు గుర్తింపు ఇచ్చినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీకాకుళం నుంచి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం వైఎస్ జగన్ వరకు తన ప్రస్థానం కొనసాగిందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్‌కు, పార్టీకి తన సేవలు అంకితమన్నారు. ఇటీవలే టెక్కలి నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు మంచి మోజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ పదవికి తన పేరును ఎంపిక చేయడం హర్షనీయమన్నారు.
అనంతపురం: వరుసగా రెండోసారి శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ధన్యవాదాలు తెలిపారు. కష్టపడేవారిని సీఎం జగన్ గుర్తిస్తారని.. అడక్కుండానే పదవులు ఇవ్వటం జగన్‌కే సాధ్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని ఇక్బాల్ హర్షం వ్యక్తం చేశారు.
తాడేపల్లి : సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పరని మరో మారు నిరూపించుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. నాన్న చనిపోయిన తర్వాత జగనన్న తమకు అండగా నిలిచారని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తనను అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. జగనన్న అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, భవిష్యత్తులో జగనన్న ఇచ్చే ఏ ఆదేశాన్నైనా శిరసవహించడమే తన కర్తవ్యమని కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.
చదవండి: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment