
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే తాము రాజీనామాలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం తాము అనేక పోరాటాలు చేశామని, చివరి అస్త్రంగా రాజీనామాలను సంధించామని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. గత ఏప్రిల్ 6వ తేదీనే రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, కానీ స్పీకర్ విధిలో భాగంగా పునరాలోచన చేయాలని తమను ఆమె కోరారని తెలిపారు.
రాజీనామాలను ఆమోదించాల్సిందేనని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరతామన్నారు. ఉప ఎన్నికలు వస్తే సీఎం చంద్రబాబు పోటీకి రాబోరని అన్నారు. సీఎం చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, చంద్రబాబువి ఉత్తరకుమార ప్రగల్భాలేనని కొట్టిపారేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఈ పాటికే ఉప ఎన్నికలు వచ్చేవన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహంతో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు మంటగలిపారని, ఈసారి చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.