సాక్షి, విశాఖపట్నం : స్వాతంత్య్రం వచ్చాక విపరీతంగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా విలువ చంద్రబాబుకు తెలియదన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి వట్టిచేతులతో తిరిగివచ్చిన ముఖ్యమంత్రి కూడా ఆయనేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయించలేని అమసర్థ ముఖ్యమంత్రి చంద్రబాబేనంటూ నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వరప్రసాద్ మాట్లాడారు.
‘ప్రత్యేక హోదా తేలేకపోవడం వల్ల గత నాలుగు సంవత్సరాల్లో లక్షాముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులుపాలు కావాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక గత 60-70 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం కోసం కేవలం 90 వేల కోట్ల రూపాయల అప్పు తెస్తే.. ఇప్పుడు కేవలం నాలుగేళ్లలో ఏపీని అప్పుల పాలు చేశారు’ అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబేనని, ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరినా.. నేటికి చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు.
ఢిల్లీలో ఉన్న అహంకారి నరేంద్రమోదీ అని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం నిరసన చేపడుతున్నామని తెలిసి కూడా ఆయన కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఐదుగురు ఎంపీలం రాజీనామాలు చేశామన్నారు. ఈ రోజు చంద్రబాబు మోసానికి, వంచనకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టామన్నారు. పదిరోజుల క్రితం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఎందుకు చేశారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. అన్ని హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ప్రజలను ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరూ తెలుసుకోవాలని అన్నారు. కంపెనీలకు సీఈవోలు ఉంటారని, కానీ మన రాష్ట్ర దౌర్బాగ్యం ఏమిటంటే చంద్రబాబు కూడా సీఈవోగా వ్యవరిస్తున్నారు తప్పితే సీఎంలా వ్యవహరించడంలేదని విమర్శించారు. జన్మభూమి కమిటీలను పెట్టి పరిపాలన సాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి, పార్టీకి తేడా లేకుండా చేశారని అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి ప్రజలను విముక్తి కలిగించాలంటే.. వచ్చే ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించాలని, అబద్ధాలతో, రంగులు మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమితరిమికొట్టాలని వరప్రసాద్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment