
విజయసాయి రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,767 కోట్లు ఇచ్చామని కేంద్ర పారిశుద్ధ్యశాఖ మంత్రి రమేష్ చందప్ప తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు వివరాలతో కూడిన ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు.
ఏపీలో 5లక్షల ఇళ్లకు మరుగు దొడ్ల సౌకర్యం లేదని, 2015-16 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు ఈ వార్షిక ప్రణాళికల అమలుకోసం ఏపీ 4,470 కోట్లు కోరగా అందుబాటులో ఉన్న నిధుల నుంచి 1,767 కోట్లు ఇచ్చామని మంత్రి రమేష్ చందప్ప సమాధానమిచ్చారు.
ఐఎన్‌ఎస్ విరాట్‌పై డీపీఆర్ పరిశీనలో ఉంది
భారత నౌకాదళ సేవల నుంచి విశ్రమించిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా రుపుదిద్దాలన్న ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రస్తుతం తమ పరిశీనలో ఉన్నట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ భామ్రే వెల్లడించారు.
సోమవారం రాజ్య సభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విరాట్‌ను మ్యూజియం, హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖకు డీపీఆర్ పంపినట్లు తెలిపారు. తమ మంత్రిత్వ శాఖ ఈ డీపీఆర్‌ను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.