సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న ఇచ్చిన రాజీనామాలను ఆమోదించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఎంపీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదంపై పార్లమెంట్ బులెటిన్ ద్వారా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని మే 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలను కోరిన సంగతి తెలిసిందే. తమ నిర్ణయంలో మార్పు లేదని వారు తేల్చిచెప్పారు. బుధవారం మరోసారి స్పీకర్‌ను కలిశారు. ఉదయం 11 గంటలకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినా ష్‌రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్పీకర్‌ను ఆమె చాంబర్‌లో కలిశారు. వీరివెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు.
నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం..
స్పీకర్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు అరగంటకు పైగా సమావేశమయ్యారు. రాజీనామాలపై మరోసారి పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించగా... తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని, రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ సభ్యులు కోరారు. దీనిపై రాతపూర్వకంగా మరోసారి నిర్ణయాన్ని(రీ కన్ఫర్మేషన్) తెలపాలని స్పీకర్ సూచించడంతో ఆ మేరకు ఎంపీలు లేఖలు సమర్పించారు. ‘‘16వ లోక్‌సభ సభ్యత్వానికి నేను 2018 ఏప్రిల్ 6న రాజీనామా చేశాను. ఈ రాజీనామాపై పునరాలోచించాలని మే 29న మీరు(స్పీకర్) సూచించారు. మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదాలు. నేను ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. నా రాజీనామాను ఆమోదించాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను’’ అని రాసి ఉన్న లేఖలను లోక్‌సభ సభ్యులు విడివిడిగా సభాపతికి అందజేశారు.
‘హోదా’ కోసం పదవీ త్యాగం
ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తుదికంటా పోరాటం చేస్తారని, కేంద్రం స్పందించకపోతే వారంతా పదవులకు రాజీనామా చేస్తారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 1న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మార్చి 5న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ పార్టీ తరపున ఎన్డీయే ప్రభుత్వంపై మార్చి 22న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు కుదిస్తారనే వార్తలు రావడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిర్ధేశిత తేదీ కంటే ముందుగానే.. మార్చి 15న కేంద్రంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.
దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడంతో ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ వరుసగా 13 అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. 12 నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభలో ప్రస్తావించారు. అయితే, సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నందువల్ల వాటిపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్ జగన్ మార్చి 31న స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6 వరకూ ప్రత్యేక హోదా కోసం సభలో నినదించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి సమావేశాలు వాయిదా పడగానే నేరుగా స్పీకర్ చాంబర్‌కు వెళ్లి, స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖలను సమర్పించారు. అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వచ్చి అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాజీనామాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో తేల్చిచెప్పారు. వారి రాజీనామాల ఆమోదానికి స్పీకర్ తాజాగా అంగీకారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment