ఒకటే మాట.. ఒకటే బాట | YS Jagan fight towards ap special status | Sakshi
Sakshi News home page

ఒకటే మాట.. ఒకటే బాట

Published Fri, Jun 22 2018 4:14 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YS Jagan fight towards ap special status  - Sakshi

సాక్షి, అమరావతి: ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో తొలి నుంచీ రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడంతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. ‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు – ప్యాకేజీలతో మోసం చేయొద్దు’ అంటూ నాలుగేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకోన్ముఖంగా పోరాడుతున్నది. 

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, అదొక్కటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నిరుద్యోగ యువత భవితకు బాటలు వేస్తుందని గట్టిగా విశ్వసించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను స్వయంగా అమరణ నిరాహారదీక్ష చేయడంతో పాటు ఉద్యమంలో వాడి వేడీ ఏ మాత్రం చల్లారకుండా ఎప్పటికప్పుడు అనేక పోరాటాలు సాగిస్తూ వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పలు రకాల రాయితీలు వస్తాయని... రాయితీలొస్తే వేలల్లో పరిశ్రమలొస్తాయని.... పరిశ్రమలొస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని జగన్‌ ప్రజల్లో చైతన్యం రగిలించారు.

బీజేపీతో కలసి అధికారం పంచుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా పట్టుబట్టి అడిగిందే లేదు. జగన్‌ మాత్రం అవకాశం ఉన్న వేదికలన్నింటిపైనా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారు. అమరావతి నుంచి ఢిల్లీ దాకా ప్రత్యేక హోదా వాణిని వినిపించారు. గుంటూరులో 2015 అక్టోబర్‌ 7వ తేదీ నుంచి అమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది. ఆ తరువాత జగన్‌ మరో అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా కోసం నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టడానికైనా సిద్ధమని ప్రకటించారు.

జనంలో భావోద్వేగాలతో బాబు యూటర్న్‌
ప్రత్యేక హోదా పోరులో అగ్రభాగాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ దూసుకు పోతూండటంతో అప్పటి దాకా ‘ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కిన ముఖ్యమంత్రి ఒక్కసారిగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తూ ‘యూటర్న్‌’ తీసుకున్నారు. హోదా కావాలంటూ తాము నిర్ణయించిన ప్రజా ఎజెండాను చంద్రబాబు కూడా అనుసరించక తప్పని పరిస్థితులను జగన్‌ కల్పించారు.

పార్లమెంటు సాక్షిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు ... ఆదరాబాదరా ఎన్డీయే ప్రభుత్వం నుంచి తన మంత్రులను వైదొలగింప జేయడంతో పాటుగా రాజకీయంగా తెగదెంపులు చేసుకుని తన ఎంపీల చేత చంద్రబాబు కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసును ఇప్పించారు. నాలుగేళ్ల తరువాత ప్రత్యేక హోదా వద్దు... ప్యాకేజీ ముద్దు అన్న నోటి నుంచే చంద్రబాబు హోదా కోసం సై అనాల్సి వచ్చింది. ప్రతిపక్షం నిర్ణయించిన ఎజెండానే చంద్రబాబు అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని,  ఈ ఘనత ప్రతిపక్ష నేత జగన్‌దేననే ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి.

ఎవరెంతగా ప్రజలను మభ్యపెట్టాలని చూసినా ప్రత్యేకహోదాయే సంజీవని, అదే మా ఊపిరి అంటూ జగన్‌ ధృఢంగా నిలబడ్డారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ చేయని పోరాటం లేదు. ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్ర బంద్‌లు నిర్వహించారు. చివరకు ఆమరణ దీక్ష కూడా చేశారు.  తుదిదశ పోరాటంలో భాగంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, అన్ని పక్షాల సంఘీభావాన్ని సంపాదించి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. పార్లమెంటు బడ్జెట్‌సమావేశాలు ముగిసే వరకు హోదా కోసం పోరాటం కొనసాగిస్తూనే చివరి రోజున ఎంపీలు రాజీనామా చేశారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకున్నారు.


కేంద్ర పెద్దలకు వినతులు
ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ నాలుగేళ్లుగా దశల వారీగా ఉద్యమాన్ని నడిపించారు. హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే నరేంద్రమోదీని 2014, మే 19న పార్టీ ఎంపీలతో కలసి.. ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలన్నీ నెరవేర్చాలని, రాజధానికి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

10 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ అలక్ష్యం వల్ల హోదా, విభజన హామీల అమలులో ఆలస్యం జరుగుతుండటంతో మళ్లీ 2015, మార్చి 30న, 2017 మే 10న ప్రధానిని కలిశారు. 2015 జూన్‌ 11న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని, 2016 ఏప్రిల్‌ 26న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని కలసి విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు.

యువతలో చైతన్యం నింపేందుకు..
హైదరాబాద్‌ను కోల్పోయిన రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కోల్పోయింది. ప్రత్యేక విమానాల్లో రూ.కోట్లు వెచ్చించి దేశాలు తిరగడమే తప్ప ఒక్క పరిశ్రమనూ చంద్రబాబు తీసుకురాలేకపోయారు. ప్రత్యేక హోదా ఉంటే వచ్చే రాయితీలను చూసి పరిశ్రమలు వాటంతటవే తరలివస్తాయని జగన్‌ యువతకు అర్థమయ్యేలా వివరించారు.

ముఖ్య పట్టణాలన్నిటిలోనూ యువభేరి సదస్సులు నిర్వహించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. యువభేరి సదస్సులకు విద్యార్థులను పంపితే అరెస్టులు చేయిస్తామని తల్లిదండ్రులను బెదిరించారు. పీడీ యాక్టులు పెడతామన్నారు. అయినా వెరవక యువత భారీ స్థాయిలో యువభేరి సదస్సులకు పోటెత్తింది.

ధర్నాలు, దీక్షల బాట
ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో వైఎస్‌ జగన్‌ ధర్నాలు, దీక్షల బాట పట్టారు. మొదటగా 2014 డిసెంబర్‌ 5న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన ధర్నాలో జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. తర్వాత 2015 జూన్‌ 3న మంగళగిరిలో రెండు రోజుల సమరదీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. అదే ఏడాది ఆగస్టులో ఢిల్లీలో తొలిసారిగా జగన్‌ ఒక రోజు ధర్నా చేశారు. మళ్లీ ఆగస్టు 29న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వగా ప్రజలందరి మద్దతు లభించింది.

రాష్ట్రపతితో భేటీలు
కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని సైతం (జూన్‌ 9, 2015, ఫిబ్రవరి 23, 2016, ఆగస్టు 8, 2016) మూడుసార్లు కలసి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే మూడేళ్లలో పూర్తి చేసేలా చూడాలని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వేళ..
జగన్‌ 2015 అక్టోబర్‌లో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ప్రధాని మోదీ ఏపీకి రానుండడంతో..  ఏపీ ఆకాంక్ష గురించి ఆయన గ్రహిస్తారని అంతా భావించారు. కానీ ఏడో రోజున రాష్ట్ర ప్రభుత్వం జగన్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి దీక్షను భగ్నం చేసింది.

ఆ తర్వాత జగన్‌ పిలుపుతో అక్టోబర్‌ 17 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేశాయి. మలిదశ పోరులో భాగంగా 2016, మే 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. కాకినాడలో జరిగిన నిరసనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. అదే ఏడాది ఆగస్టు 2న, సెప్టెంబర్‌ 10న రాష్ట్రబంద్‌ నిర్వహించారు.

ఉక్కుపాదానికి ఎదురొడ్డి నిలిచి..
ప్రత్యేక హోదా అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం తట్టుకోలేని చంద్రబాబు హోదా పోరుపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. హోదాకు మద్దతుగా విశాఖలో 2017 జనవరి 26, 27 తేదీల్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు హాజరవడానికి వెళ్తున్న వైఎస్‌ జగన్‌ను అప్రజాస్వామికంగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా రన్‌వేపైనే జగన్‌ బైఠాయించారు. అదే ఏడాది నవంబర్‌లో వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా.. ప్రభుత్వం అడ్డుకుంది.


హోదాపై చంద్రబాబు పూటకో మాట
ఏప్రిల్‌ 29, 2014:    
మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇచ్చారు. నేను మోదీగారిని కోరుతున్నా. 15 ఏళ్లు ఇవ్వండి. తిరుపతిలో ఎన్డీఏ సభలో చంద్రబాబు
ఆగస్టు 25, 2015:    
ప్రత్యేక హోదా సంజీవని కాదు. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో
మే 17, 2016:    
హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
మే 18, 2016:
హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విన్నవించా.
సెప్టెంబర్‌ 8, 2016:    
ప్రత్యేక హోదా వీలుకాదు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామని చెబుతుంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం?
సెప్టెంబర్‌ 9, 2016:    
హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా.
సెప్టెంబర్‌ 10, 2016:
హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.. కేంద్రం చెప్పినదానికంటే అదనంగా ఏమొస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు.
సెప్టెంబర్‌ 15, 2016:
హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు.
సెప్టెంబర్‌ 19, 2016:
హోదా ప్యాకేజీకి సమానం. అందుకే అంగీకరించాం.
సెప్టెంబర్‌ 26, 2016:
హోదా అంటే జైలుకే.. విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్‌..
అక్టోబర్‌ 28, 2016:
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు
జనవరి 25, 2017:
హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎక్కడుంది? ఏ జీవోలో ఉందో చూపండి. హోదాకు, రాయితీలకు సంబంధం లేదు.
ఫిబ్రవరి 3, 2017:
హోదా వేస్ట్‌. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు.
ఫిబ్రవరి 15, 2017:
ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు.
మార్చి 15, 2017:
సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేక సాయానికి కేంద్రం ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం.
మార్చి 16, 2017:
మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం.
మార్చి 7, 2018:
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్‌ జైట్లీ అవమానకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం కింద ఇస్తామని అప్పుడు ప్రకటించారు. అవి కూడా సరిగా ఇవ్వలేదు.
మార్చి 8, 2018:
కేంద్ర మంత్రివర్గం వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు.
మార్చి 10, 2018:
వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వం.
మార్చి 15, 2018:
వైఎస్సార్‌సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొంతమంది కావాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. (అసెంబ్లీలో)
మార్చి 16, 2018:
మేమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. వైఎస్సార్‌సీపీ పెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వం (టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో)
మార్చి 24, 2018:
హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకిచ్చిన రాయితీలు ఇస్తే ఓకే.

ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :

పదవీ త్యాగానికి ఆమోదం

‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’

వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు!

‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement