సాక్షి, తాడేపల్లి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మీరు గెలుపొందారు. అంతేగాక సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ, ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు.. పార్టీ సభ్యుడిగా ఉండటం పట్ల మీ అయిష్టతను తెలియజేస్తున్నాయి. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండకుండా.. వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్గానం చేసింది. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. అయితే మీరు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా.. ఈ విషయంలో వైస్సార్‌సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారని ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా నవంబరు 19, నవంబరు 20, 2019 తేదీల్లో పత్రికల్లో ప్రచురించాయి. ఈ విషయంపై వివిధ స్థాయిల్లో పార్టీ వివరణ కోరింది.
ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారంటూ మీరు చేసిన నిరాధార వ్యాఖ్యలను ఈనాడు జూన్ 16, 2020న ప్రచురించింది. అదే విధంగా ఆంధ్రజ్యోతి సైతం జూన్ 15, 2020న మీ పేరును ఆపాదిస్తూ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. ఎంపీగా మీ విజయానికి వైఎస్సార్‌సీపీ లేదా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణం కాదని మీరు అన్నారు. బతిమిలాడితేనే పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘‘ఎవ్వరి నాయకత్వం నాకు కావాలి? బొచ్చులో నాయకత్వం?’’ వంటి పదాలు ఉపయోగించి ప్రాథమిక నిబంధనలు అతిక్రమించారు. ఈ పరిణామాలన్నీ మీరు పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుపుతున్నాయి.
అదే విధంగా అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మీరు వివిధ టీవీ షోల్లో విమర్శించారు. అంతేగాక సొంతపార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఓ టీవీ డిబేట్‌లో మిమ్మల్ని మీరు సింహంగా అభివర్ణించుకోవడమే గాకుండా.. విశ్వసనీయత ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులను పందులతో పోల్చారు. సహచర సభ్యులను తక్కువ చేసి మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీరు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మీ మాటలు, చేతలను బట్టి ఇలా భావించాల్సి వస్తోంది. కాబట్టి ఈ విషయాలపై స్పందించేందుకు మీకు ఏడు రోజుల గడువు ఇస్తున్నాం. లేనిపక్షంలో పార్లమెంటరీ పార్టీ.. చట్ట ప్రకారం తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది’’ అని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరిట జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇందుకు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment