
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు సైతం ఇచ్చిన విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుర్తుచేశారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలను నెరవేరుస్తామని కేబినెట్ లో తీర్మానం చేశారని తెలిపారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం హోదా కంటే ప్యాకేజే కావాలని తీర్మానం చేసిందని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజి మంజూరు చేయడంపై అసెంబ్లీలో ధన్యవాదాలు చెప్తూ తీర్మానాలు చేసి.. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం చంద్రబాబు అభినందించి వచ్చారని తెలిపారు. విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో ఉమ్మారెడ్డి మాట్లాడారు.
ప్రత్యేక హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు ఏమన్నా అబివృద్ధి చెందాయా అంటూ ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు పేర్కొన్నారని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోనూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారని, దీంతో అసెంబ్లీలో సభ్యులందరూ తీర్మానంచేసి ఆమోదించినా.. దానిని చంద్రబాబు కేంద్రానికి పంపలేదని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు ప్యాకేజికి అంగీకరించి అసెంబ్లీని సైతం అవమానించారని మండిపడ్డారు. ‘చంద్రబాబు తీరుతో ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ తిరుగులేని పోరాటం చేశారు. మండల స్థాయినుంచి జిల్లా స్థాయివరకు ప్రతి జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉద్యమించారు. ఈ సమయంలో చంద్రబాబు హోదా ఏమన్నా సంజీవనా అని ప్రశ్నించడమే కాదు హోదా కావాలన్న ప్రతి ఒక్కరినీ హేళన చేస్తూ మాట్లాడారు’ అని చంద్రబాబు తీరుపై ఉమ్మారెడ్డి మండిపడ్డారు.
పార్లమెంట్ లో ఆఖరి బడ్జెట్ సెషన్ వచ్చాక ఎన్నికల సంవత్సరం కావడంతో తాము కూడా పోరాటం చేస్తామంటూ చంద్రబాబు నాటకాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు. హోదా ఇవ్వనందుకు వైఎస్ జగన్ కేంద్రంపై అవిశ్వాసం పెడతామంటే ముందు అనవసరం లేదని, ఆ తర్వాత మద్దతు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. కొన్ని గంటలే మళ్లీ మాట మార్చి.. తామే అవిశ్వాసం పెడతామని ప్రకటించారని, ఇలా తన రాజకీయ అవసరాల కోసం గంటకో మాటమార్చుతూ.. యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ రాజీనామా చేయించినా.. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించకుండా చంద్రబాబు సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వ్యవహరించాని విమర్శించారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడితే అదుపుచేయలేని కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఏకంగా దేశచరిత్రలో ఎన్నడూలేనివిధంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిరహారదీక్ష చేశారని గుర్తుచేశారు. దీంతో నేనేం తక్కువ తిన్నానా అంటూ చంద్రబాబు రూ. 30 కోట్లు ఖర్చు పెట్టి ధర్మదీక్ష చేశారని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని అవమానించి ముతక సామెతలు చెప్పి మరీ హేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని యూటర్న్‌లు తీసుకొని ప్రజలను వంచిస్తున్నారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment